పెద్దనోట్ల రద్దుతో తగిలిన గాయాలు కాలంతో పాటు పెరిగి వికృతంగా కనిపిస్తున్నాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి గురువారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్ 8న తీసుకున్న దురాలోచన, దురదృష్టకరమైన నిర్ణయం.. భారతీయ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై చూపిన వ్యతిరేక ప్రభావం ఈరోజుకీ కనిపిస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపించింది. అన్నింటినీ కాలమే మాన్పుతుందని చెబుతుంటారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాలు మాత్రం దురదృష్టవశాత్తూ... కాలంతో పాటు మరింతగా పెరుగుతూ వికృతంగా కనిపిస్తున్నాయి.
జీడీపీ దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్దనోట్ల రద్దు షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోయాయి. ఉపాధిపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడింది. ఆర్థిక మార్కెట్లు దుర్బలంగా మారాయి. మౌలిక వసతుల ప్రాజెక్టుల రుణ దాతల్ని, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థల వనరులను ఆవిరి చేసింది. దీని ప్రభావాన్ని మనం ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. రూపాయి మారక విలువ తగ్గిపోయింది. ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది.
సంప్రదాయ విరుద్ధమైన, స్వల్పకాలిక చర్యలపై ఆధారపడకపోవడం చాలా మంచిది. అలాంటి వాటివల్ల భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లలో మరింత అనిశ్చితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో నిర్దిష్టత, స్పష్టతను పునరుద్ధరించాలి. ఆర్థిక దుస్సాహస చర్యలను, అనాలోచిత ఆర్థిక విధానాలను అమలుచేస్తే వాటి ప్రభావం దీర్ఘకాలంలో దేశంపై ఎలా ఉంటుందోనన్న సత్యాన్ని ఈ రోజు గుర్తుచేస్తుంది’ అని మన్మోహన్ పేర్కొన్నారు. ‘ఎలాంటి గాయాన్నైనా మాన్పించే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, నోట్ల రద్దు అలా కాదు. కాలం గడిచేకొద్దీ ఆ గాయం మరింత స్పష్టంగా కనపడుతుంది.’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.