గత కొంత కాలంగా, తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నేతల వ్యవహార శైలి పై చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్నారు. మీరు పార్టీకి బలం అవ్వాలి కాని, బలహీన కాకూడదు అంటూ, ఎప్పటికప్పుడు వారి పని తీరుతో సర్వే రిపోర్ట్ లు ఇచ్చి మరీ, వారిని హెచ్చరిస్తున్నారు. ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం మానటం లేదు. తాజగా, మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేయాలని కోరితే 12 మంది మంత్రుల నియోజకవర్గాలు సహా మొత్తం 67 స్థానాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని, ఎందుకు చేపట్టలేదో సమాధానం చెప్పాలని కోరారు. ప్రజలతో ఉంటేనే మనకు భవిషత్తు అనే విషయం మర్చిపోవద్దు అని, ప్రజల కోసం మనం ఉన్నామనే విషయం మర్చిపోతే, మన రాజకీయ జీవితం సమాధి అవుతుందని అన్నారు.
మీరంతా రేంద్ర మోదీ అన్నల్లా తయారవుతున్నారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉండాలనుకుంటేనే ఇక్కడ ఉండండి.. తిరగలేకపోతే ఆ మాట చెప్పి పక్కకు తప్పుకోండి. లేకపోతే నేనే తప్పించాల్సి వస్తుందని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎప్పుడూ ఇలాగే చెప్తాదులే, ఏమి చెయ్యరు అనుకోకండి, ఢిల్లీ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు, ఇప్పుడు నేను వేసే ప్రతి అడుగుతో ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రజల్లో ఉంటే, మీకు, పార్టీకి కూడా మంచిదని అన్నారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగితే గ్లామర్ తగ్గుతుందనుకుంటున్నారు. కందిపోకూడదని అనుకుంటే తర్వాత అసలుకే మునిగిపోతారు. చాలా మంది ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. జనంతో మమేకమవడం రాజకీయ నాయకుడి లక్షణం. గ్లామర్‌సగా ఉండాలనుకుంటే వేరే రంగంలోకి వెళ్లండి’ అని స్పష్టం చేశారు.
గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమం కూడా చురుగ్గా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. ధర్మ పోరాట దీక్ష సభల కోసం జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు అదనంగా ఉండి నియోజకవర్గ సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలు కోరగా దానికి చంద్రబాబు అంగీకరించారు. దేశవ్యాప్తంగా ప్రభ క్షీణిస్తున్నా బీజేపీ దురుసుతనం ఇంకా తగ్గలేదని సీఎం వ్యాఖ్యానించారు. కర్ణాటకలో గత ఎన్నికలతో పోల్చితే ఇటీవలి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్లు బాగా తగ్గిపోయాయని, ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనమని అన్నారు.