జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణంలో భాగంగా, మరో రెండు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. దీని కోసం ఈ నెల 20 నుంచి షడ్యుల్ అనుకున్నా, చంద్రబాబు ఈ రోజే, ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. గురువారం ఆయన కర్ణాటక, వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధాహ్నం మూడు గంటలకు బెంగూళురు పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడలను కలిసి మాట్లాడతారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో వీరి భేటీ జరగనుంది.
కర్ణాటక కాంగ్రెస్ నేత శివ కుమార్ తదితరులు కూడా అక్కడ ఆయనను కలుస్తారు. ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో.. ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు జేడీఎస్‌తోనూ చర్చించనున్నారు. ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.
ఈ నెలలో ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల భేటీని నిర్వహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీనికి ముందస్తు కసరత్తులో భాగంగా ఆయన వివిధ పార్టీల నేతలను స్వయంగా కలుసుకొని మాట్లాడుతున్నారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని చంద్రబాబు అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కుమార స్వామికి ఫోన్ చేసి తన అభినందనలు తెలిపారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల నెలకొన్న వ్యతిరేక వాతావరణానికి ఈ ఫలితాలు నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.