విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన జె. శ్రీనివాసరావు, ఆయన సోదరుడు సుబ్బరాజు టీడీపీ క్రియాశీలక కార్యకర్తలేనని పేర్కొంటూ సృష్టించిన నకిలీ టీడీపీ సభ్యత్వ కార్డులకు సంబంధించి నమోదైన కేసులో కృష్ణాజిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. గత నెల 28న విజయవాడలో జోగి మాట్లాడుతూ.. జగన్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఆయన సోదరుడు సుబ్బరాజు టీడీపీ కార్యకర్తలేనన్నారు. అంతేకాక వారి పేరు, ఫొటోలతో ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డులను చూపారు. అయితే, అదే రోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అదే రోజు ఐపీసీ సెక్షన్లు 420, 468, 469, 471, 201, 120(బి), 504, 505తో పాటు ఐటీ యాక్టు 66 (2000, 2008) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో హాజరు కావాలని రమేశ్‌కు నోటీసు జారీ చేశారు. దీంతో మంగళవారం ఆయన వచ్చారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారధి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, వైసీపీ నేతలు పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు. అర్బన్ అదనపు ఎస్పీ వైటీ నాయుడు ఆధ్వర్యంలో వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత, అరండల్‌పేట సీఐ వై. శ్రీనివాసరావులు జోగి రమేశ్‌ను విచారించారు. రమేశ్ వెంట న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేయబోతున్నారని అనుమానించిన వైసీపీ కార్యకర్తలు స్టేషన్ ఎదుట కొద్ది సేపు ఆందోళనకు దిగారు.
కాగా.. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు జోగి రమేశ్ సమాధానం దాటవేసినట్లు తెలిసింది. విలేకరుల సమావేశంలో చూపిన టీడీపీ సభ్యత్వ కార్డు మీకు ఎక్కడిది.. అని అడిగిన ప్రశ్నకు తనకు కార్యకర్తలు ఇచ్చారని చెప్పినట్లు తెలిసింది. వారెవరంటే గుర్తులేదని, సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ప్రశ్నలు నకిలీ ఐడీ కార్డులకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు సంధించినా జోగి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న మరోసారి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని పోలీసులు కోరారు. అర్బన్ అదనపు ఎస్పీ వైటీ నాయుడు మాట్లాడుతూ.. విచారణలో రమేశ్ పూర్తిగా సహకరించలేదని, మరోసారి విచారణకు రావాలని చెప్పామన్నారు.