టీఆర్ఎస్ జీ హుజూర్ పార్టీ. దండం పెట్టడం తప్ప ఇందులో చర్చకు, ప్రశ్నకు తావులేదు. దీనిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కూడా అనలేం.ప్రైవేట్ కంపెనీలోనైనా కొన్ని హక్కులు ఉంటాయి. కానీ, ఇది ఒక వ్యక్తి యజమానిగా ఉన్న కంపెనీ’అని ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికిగల కారణాలను ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పని చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం దారి తప్పిందని, జై తెలంగాణ నినాదం పోయి ఇప్పుడు జై కేసీఆర్...జై కేటీఆర్‌గా మారిందంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో ఉద్యమకారులు, కార్యకర్తలకు గుర్తింపులేదని, ఉన్నదల్లా పార్టీలో కొత్తగా చేరిన తెలంగాణ వ్యతిరేకులకేనని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడిన టీఆర్ఎస్లో ప్రస్తుతం ఎవరికి గౌరవం లేదని, అందరూ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉన్నవారేనన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమి చేస్తామని హామీలను ఇచ్చిందో వాటిన్నింటినీ పక్కన పెట్టిందన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండలేక తనలాగా చాలా మంది బయట పడటానికి ఎదురు చూస్తున్నవారేనన్నారు. పార్టీ పార్లమెంటరీ నాయకులు జితేందర్‌రెడ్డి, కేశవరావు కూడా ఎప్పుడో అప్పుడు బయటికి వచ్చేవారేన్నారు. ఎంపీలలో చివరికి మిగిలేది ఆ ఇద్దరు (కవిత, వినోద్‌కుమార్) కావచ్చని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు అందులో ఏముందో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలిసేది కాదని, పోలీసుల బదిలీల గురించి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి పేపర్లో చేశాకే తెలిసేదన్నారు. తమ శాఖల్లో ఏమి జరుగుతుందో సంబంధిత మంత్రులకు పేపర్లో చూశాకే తెలిసేదన్నారు. కేసీఆర్ పాలనను అందరు నిజాం నవాబుతో పోలుస్తారని, తన దృష్టిలో అది కూడా తప్పేనన్నారు. నిజాం హయాంలో కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆ అంశాన్ని మంత్రులతో చర్చించే ప్రజాస్వామ్యం ఉండేదని విశే్వశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలకు ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో గౌరవం ఉండేదని, ప్రస్తుతం తమను లైట్‌గా తీసుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని తమను పార్లమెంట్లో ఆందోళన చేయమని పార్టీ ఆదేశిస్తే చేశామన్నారు. అయితే సంబంధిత మంత్రి తమను పిలిచి దీని గురించి మీ సీఎం మమ్మల్ని కోరనప్పుడు ఎలా ఇస్తామని అడిగితే తమ పరువు పోయిందన్నారు.
అలాగే త్రిబుల్ తలాక్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు చర్చలో పాల్గొనకుండా చల్లగా జారుకోండని తమకు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మద్దతు అయినా ఇవ్వాలి లేకపోతే వ్యతిరేకించడమైనా చేయాలి, అలా కాకుండా చల్లగా జారుకోవడం ఏమిటో తెలియక నవ్వుల పాలయ్యామన్నారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మరుసటి రోజు సభకు వెళ్లాలో లేదో అర్దరాత్రి ఫోన్లు వచ్చేవన్నారు. వాళ్లు వెళ్లమంటే వెళ్లడం, లేదంటే మానుకోవడమే తమ పని అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాండూరుకు వెళ్లనిచ్చేవాళ్లు కాదన్నారు. అనేక సార్లు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మీరు అటు వైపు వెళ్లవద్దని చెప్పేవాళ్లన్నారు. సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేని అవమాన పరిస్థితిని ఎదుర్కొన్నాని చెప్పారు. చివరకు తాను సభకు ఎలాంటి డ్రైస్ వేసుకొని వెళ్లాలో కూడా పార్టీ వాళ్లు చెప్పేవాళ్లంటే ఇక ఇంతకంటే ఏమి చెబుతానని విశే్వశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఏమిటో పార్టీలో ఎవరికి తెలియదన్నారు. ఈ విషయాన్ని తమ పార్లమెంటరీ నాయకుడు జితేందర్రెడ్డికైనా తెలుసేమోనని అడిగితే, పేపర్లు చూడవా? అని ఎదురు ప్రశ్నించారని, కేశవరావు కూడా అదే చెప్పారన్నారు. ప్రధాని మోదీతో ఏదో ఒప్పందం కుదుర్చుకొనే శాసనసభను రద్దు చేశారని విశే్వశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఒకవైపు మైనార్టీలను నమ్మిస్తూ, మరోవైపు బీజేపీతో ఒప్పందం చేసుకోవడం వారిని మోసం చేయడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని, సాగునీటిని అందిస్తామని ఎనె్నన్నో హామీలు ఇచ్చి ఏదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. చివరకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మైనార్టీలకు కూడా మోసం చేయడాన్ని వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు. బస్సులో జేబు కొట్టిన వాడే దయదలిచి టికెట్ కొనిచ్చినట్టు ఒక్కో వ్యక్తి తలపై 61 వేల అప్పుబారం మోపి, పెన్షన్లు, షాదీ ముబారక్‌లు ఇస్తున్నారని విశే్వశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.