మన ప్రధాన మంత్రి మోడీ గారు, ఏమి చేసినా నాటకీయత ఉంటుంది. అదే ఆయన్ను 2014లో ప్రధానిని కూడా చేసిందనుకోండి. ఎన్నికల సమయంలో మన మోడీ గారి లోపల ఉన్న, ఈ నాటకీయత పదింతలు బయటకు వస్తుంది. ఆయన తల్లితో ఫోటో షూట్లు వస్తాయి.. నేను తక్కువ కులం వాడిని అని చెప్పుకుంటారు. నన్ను చంపటానికి కాంగ్రెస్, పాకిస్తాన్ తో కలిసింది అని చెప్తారు. ఇలా అనేక విధాలుగా ఆయన ప్రచారం ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ సెంటిమెంట్ తో ఆడుకుంటారు. ఇప్పుడు తెలంగాణా ఎన్నికల సమీపిస్తున్న వేళ, రాక రాక తెలంగాణా గడ్డ మీద అడుగు పెడుతున్నారు. మాములుగా వేరే రాష్ట్రం అయితే, ఈ పాటికి ఒక 20 సార్లు అయినా వచ్చి ప్రచారం చేసే వారు.
కాని, ఇక్కడ కేసీఆర్ తో ఉన్న రహస్య స్నేహంతో, ఎదో మొక్కుబడిగా ప్రచారం చెయ్యటానికి ఎట్టకేలక తెలంగాణా వస్తున్నారు. వచ్చే ముందు ఆయన తెలుగులో ట్వీట్ చేసారు. నేడు నిజామాబాద్, మహబూబ్నగర్ ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, ఈ సభ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ‘నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను... మొదట నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్నగర్లో మీతో నా భావాలు పంచుకొంటాను.. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి’ అని మోదీ ట్వీట్ చేశారు.
అయితే ప్రధాని మోడీ గారికి, ఇన్నాళ్ళకు అయినా తెలుగు గుర్తుకువచ్చినందుకు, తెలుగు ప్రజలు సంతోష పడుతున్నారు. ఉగాది కి మరచి పోయిన తెలుగు , సంక్రాంతికి గుర్తు రాని తెలుగు నేడు ఎన్నికల వేళ గుర్తొచ్చిందని, నిజంగానే మన దేశం లో ఎన్నికలు పెద్ద పండగలే అంటున్నారు. గతంలో అన్ని పండుగలకి వాళ్ళ భాషల్లో ట్వీట్ చేసే మోడీ గారు, తెలుగులో మాత్రం మనకు ఉగాదికి, సంక్రాంతికి గుర్తుకు రాలేదు. ఎన్నికల వేళ, తెలుగు ప్రజలు, తెలుగు భాష మన ప్రధాని గారికి గుర్తుకు వచ్చాయి. ఏదైనా ఇప్పుడు మీటింగ్లో కూడా, తెలుగులో మొదలు పెట్టి, ఎన్టీఆర్ పేరు చెప్పి, ఇక్కడ సెంటిమెంట్ తో పడేయటానికి రెడీ అయ్యారు. చూద్దాం, తెలంగాణా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.