ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ క ల్యాణ్ బీజేపీ పక్షమో.. కాంగ్రెస్ పక్షమో తేల్చిచెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం జిల్లా గుత్తిలో ఏర్పాటుచేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఆయన వచ్చారు. తొలుత ఇక్కడి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లివచ్చిన కిరణ్.. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర నాయకులతో కలసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వరకూ ర్యాలీగా తరలివచ్చారు. అనంతపురం-తాడిపత్రి రహదార్ల కూడలిలో ఏర్పాటుచేసిన ఇందిర, రాజీవ్ విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దేశ రాజకీయాలు రెండు పక్షాలుగా చీలాయని, రాష్ట్రంలోని వైసీపీ, జనసేన తాము ఎటువైపు ఉంటారో వెల్లడించాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన చివరి రోజుల్లో ఓ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన చిరకాల స్వప్నంగా పేర్కొన్నారని.. తండ్రి మాటను నిలపాలనుకుంటే జగన్ ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోవాల్సిన ఘడియలు ఆసన్నమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన సర్దార్ పటేల్‌ను ఆసరాగా చేసుకుని పరపతి పెంచుకోవడానికి బీజేపీ పాకులాడుతోందని కిరణ్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ కంటే ఎక్కువకాలం జైలుకు వెళ్లిన నెహ్రూ ఈ దేశానికి ప్రధాని కావడం సమంజసమని పటేల్ స్వయంగా చెప్పారన్నారు.
ఎన్డీఏ పాలనలో దేశం అస్థిరత ఎదుర్కొంటోందని.. దేశాన్ని కుల, మతాలకు అతీతంగా సమానంగా చూడగలిగింది ఒక్క కాంగ్రెసేనని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒడిలాంటిదని అభివర్ణించారు. హోదా ఆంధ్రుల హక్కని నినదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సను ఆదరించాలని పిలుపిచ్చారు. తాము అధికారంలోకి వస్తే గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సీనియర్ నేతలు తులసిరెడ్డి, శైలజానాథ్ తదితరులు పాల్గొన్నారు.