హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేశాయని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు జి ప్లస్-3 కేటగిరీలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ ఇళ్లు దేశంలోనే మోడల్ ఇళ్లుగా మారతాయన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 82 ఎకరాల్లో నిర్మిస్తున్న 9500 గృహాలు, నరసాపురంలో ఇళ్ల నిర్మాణం కోసం సేకరించే స్థలాన్ని నారాయణ పరిశీలించారు.

housing 15112018 2

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని పలు ప్రారంభోత్సవల్లో ఆయన పాల్గొన్నారు. భీమవరంలోని ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. వివిధ దేశాల్లో అత్యాధునికమైన టెక్నాలజీగా పేరొందిన షీర్‌వాల్ పరిజ్ఞానంతో రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. మలేషియా, దక్షిణ కొరియా దేశాల నుంచి పరికరాలు రావాల్సివుందని, అవి వచ్చిన తర్వాత రోజుకు 50వేల ఇళ్లకు శ్లాబ్ పనులు జరుగుతాయన్నారు. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 35 వేల ఇళ్లకు శ్లాబ్ పనులు జరుగుతున్నాయన్నారు.

housing 15112018 3

వచ్చే ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.1000 కోట్లతో స్థలాలు కొనుగోలుచేసి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఒక మినీ టౌన్ మాదిరిగా ఈ ఇళ్ల కాలనీలు ఉంటాయని, ఆసుపత్రి, పాఠశాలలు, షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, కమ్యూనిటీ హాళ్లను ఈ కాలనీల్లో నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లో రూ.45వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కొటికలపూడి గోవిందరావు తదితరులు మంత్రి నారాయణ వెంట ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read