చంద్రబాబు పడుతున్న కష్టం ఫలిస్తుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి మరో భారీ పెట్టుబడితో, అతి పెద్ద కంపెనీ రానుంది. దేశంలోనే పెద్ద విదేశీ పెట్టుబడి అయిన కియా మోటార్స్ తరువాత, ఇదే రెండో అతి పెద్ద పరిశ్రమ. ఇండోనేసియా దేశానికీ చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్ పేపర్ (ఏపీపీ) గ్రూపు, అనుబంధ సంస్థ సినర్ మాస్ గ్రూపు మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది. రెండు దశల్లో రూ.21,600 కోట్ల (3 బిలియన్ యూఎస్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. టిష్యూ, ప్యాకింగ్, పేపర్ తయారీ పరిశ్రమను 2 వేల ఎకరాల్లో పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే ఈ కంపెనీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రకాశం జిల్లాలో పెట్టుబడుల పై సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన కంపెనీ నిర్వాహకులు నెలాఖరులో ముఖ్యమంత్రికి డీపీఆర్ అందజేయనున్నారు. అందుబాటులో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు కర్రలను ఉపయోగించి పేపర్ పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పరిశ్రమలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముడి సరుకు కలిగిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇటీవల సినర్ మాస్ గ్రూపు ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లారు.
ప్రపంచ వ్యాప్తంగా టిష్యూ, ప్యాకింగ్, పేపర్‌కు బాగా గిరాకీ ఉన్నందున ఎగుమతులకు వీలుగా ఓడరేవుకు సమీపంలో భూములు కావాలన్న నిర్వాహకుల సూచనల పై రామాయపట్నంలోని పలు ప్రాంతాలను చూపించారు. భారీ పెట్టుబడులతో వచ్చేవారికి ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అధికారులు వివరించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాథమిక నిర్ణయానికి సినర్ మాస్ గ్రూపు వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో రెండు బిలియన్లు, తదుపరి దశలో బిలియన్ డాలర్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.