‘రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉన్నా వినయం అవసరం. నాయకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. నేను సర్పంచిని, ఎంపీటీసీని, మంత్రిని, పెత్తందారీ వ్యవస్థ నడుపుతా.. నా మాటే చెల్లాలంటే ఆ రోజుకు బాగున్నా ప్రజలు సమయం చూసి దెబ్బేస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ‘నేను ఛాయ్‌వాలానని చెప్పిన మోదీకి కూడా ప్రధాని అవుతూనే ఎక్కడా లేని అహంకారం వచ్చింది. తనను వ్యతిరేకించిన వారిని అణగదొక్కుతున్నారు. మనకు అన్యాయం చేశారు. ధర్మంగా వ్యవహరిస్తే అది మనల్ని కాపాడుతుంది. అధర్మమైతే ఎప్పటికైనా నష్టమే..’ అని పేర్కొన్నారు. ‘నాకేమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో భాజపా అధికారంలోకి రావడం కల్ల’ అని స్పష్టం చేశారు.
ఫరూక్, కిడారి శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో అరకు నియోజకవర్గ నేతలు, మైనారిటీ వర్గ ముఖ్యులతో చంద్రబాబు ఉండవల్లి ప్రజావేదికలో సమావేశమయ్యారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరంతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తెదేపా పాత్రను వివరించారు. ‘మోదీ లేకపోతే దేశం లేదనే ఆలోచనను ప్రజల్లో రేకెత్తించడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం కల్గిస్తోంది. ఇది వాస్తవం కాదని అందరికీ చెబుతున్నాం. ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది..’ అని చంద్రబాబు వివరించారు. ‘మోదీకంటే హేమాహేమీలు మా వైపున్నారు. మీ నాయకుడు ఎవరని విలేకరులు అడిగితే మోదీ కంటే స్టాలిన్ చాలా నయమని చెప్పా..’ అని వివరించారు.
‘మనం ఎన్డీయే నుంచి బయటకొచ్చాకే భాజపా పతనం మొదలైంది. దేశంలోని ప్రధాన పార్టీలు, ముఖ్యనేతలంతా కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు. కర్ణాటక, తమిళనాడులో ఘనంగా స్వాగతించి మద్దతిస్తామన్నారు’ అని వివరించారు. ‘భాజపా పాలనలో మతాలపట్ల అసహనం నెలకొంది. పేదలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ వ్యవహార శైలిపైనా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన రాజకీయంగా మాట్లాడితే సరే. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధానం సరికా’దని మండిపడ్డారు. ‘అందుకే మహాకూటమి ఏర్పాటుచేశాం. అక్కడ ఒక అడుగు తగ్గాం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు. ‘మర్యాదగా ఉంటే మర్యాదగానే ఉంటాం. అన్యాయం జరిగినప్పుడు మనకంటే గట్టిగా పోరాడేవాళ్లు దేశంలో ఎక్కడా లేరు’ అని పేర్కొన్నారు.