ఈ రాష్ట్రంలో, పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ ని, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, పట్టిసీమ ఎలా ఉపయోగమో చెప్పినా, రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో చెప్పినా, మొండిగా వాదించి, పట్టిసీమ వేస్ట్ అనేసాడు. అయితే, జగన్ మాటలు ఎలా ఉన్నా, పట్టిసీమ రాకతో, రాయలసీమ ముఖ చిత్రం మారిపోయింది. కరువు కష్టాలున్న చోటే... కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. సీమలో ఈ ఏడాది దాదాపు 50 శాతం లోటు వర్షపాతం నమోదైనప్పటికీ... కృష్ణా జలాలు సమృద్ధిగా అందడంతో రైతులు కరువును జయించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను గత నాలుగేళ్లుగా వేగంగా చేపడుతూ, చకచకా పూర్తి చేస్తుండటం... రెండేళ్లుగా కృష్ణాజలాలు పుష్కలంగా అందిస్తుండటం దీనికి కారణం.
కడప జిల్లాలో అవుకు టన్నెల్ నుంచి కృష్ణా జలాలను గండికోట రిజర్వాయరుకు చేర్చి, అక్కడ నుంచి మైలవరం, సీబీఆర్ తదితర రిజర్వాయర్లకు చేర్చారు. ఈ జలాశయాలకు అనుసంధానంగా ఉన్న చెరువులకు ఈ జలాలు మళ్లించారు. చెరువులను పూర్తిగా నింపడం వల్ల ఒక్కసారిగా భూగర్భజలాలు పెరిగాయి. రెండేళ్ల క్రితం దాకా వట్టినే పడిఉన్న బోర్లు నోర్లు తెరిచాయి. సాగుకు సరిపడా నీటిని అవి సమృద్ధిగా అందిస్తున్నాయి. ఈ నీటిని వాడుకొంటూ, రైతులు ఉద్యానపంటల సాగును బాగా పెంచారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పండ్లు, పూల సాగు 1,13,384 హెక్టార్లలో, కూరగాయలు 25,661 హెక్టార్లు, అరటి 22,211 హెక్టార్లు, మామిడి 28,863 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువభాగం పులివెందుల, రాయచోటి వంటి పూర్తి కరువు నియోజకవర్గాల్లోనే సాగు అవుతున్నాయి.
అంతేకాదు, మొత్తం జిల్లాలోనే పులివెందుల ఉద్యానవన సాగులో దూసుకెళుతుండటం గమనార్హం. ఈ నియోజకవర్గంలోని లింగాల గ్రామాన్ని చూస్తేనే మనకు ఆ విషయం అర్థమయిపోతోంది. అక్కడికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి.. గ్రామంలో ఆహ్లాదకర పరిస్థితులు కనిపించాయి. వేరుశెనగ, టమోట, పుచ్చకాయ, బొప్పాయి, అరటి, చీనీ తదితర పంటలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. రాయచోటి విషయానికి వస్తే.. ఎగువనున్న వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గత ఏడాది పెద్దగుండ్ల చెరువు, బూడిదగుంట చెరువులకు కృష్ణాజలాలను నింపారు. ఆ నీటిని పొదుపుగా వాడుకోవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో వేరుశెనగ, మల్బరీ, కూరగాయలు, టమోటా, దోస పంటను ఎక్కువగా, అక్కడక్కడ వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడు తమ గ్రామం కరువును జయించిందని, మూడు కార్ల పంటలను సాగు చేయగలుగుతున్నామని బూడిదగుంటపల్లె గ్రామ రైతులు ధీమాతో పలికారు.