లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికలొచ్చాయంటే.. లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో.. అందరూ రాజగోపాల్ సర్వేలో ఏం చెప్పబోతున్నారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతగా ఉత్కంఠగా మారిన ఎన్నికలపై లగడపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 8 నుంచి 10 మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేటలో శివకుమార్.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు. తనకు పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు లగడపాటి. తెలంగాణ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని.. డిసెంబర్ 7న సాయంత్రం పూర్తి ఫలితాలు ప్రకటిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని రాజగోపాల్ బాంబ్ పేల్చడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, లగడపాటి రాజగోపాల్ చెప్పకనే విషయం చెప్పేశారని అంటున్నారు. ఇండిపెండెంట్లు ఎనిమిది నుంచి పది మంది గెలుస్తారని లగడపాటి చెప్పటంతో ఒక భారీ హింట్ ఇచ్చారని చెప్తున్నారు.
రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం, అంత మంది ఇండిపెండెంట్ లు గెలుస్తున్నారు అని చెప్తున్నారు అంటే, అది పాలక పక్షం పై ఉన్న వ్యతిరేకత అంటున్నారు. రులింగ్ పార్టీకి ప్రజల్లో ఊపు ఉంటే, ఇండిపెండెంట్లు గెలవరనేది రాజకీయంలో సూత్రం అని, అంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని లగడపాటి చెప్పటం, రులింగ్ పార్టీకి వ్యతిరేకతను చెప్పకనే చెప్తున్నారని అంటున్నారు. అందులోనూ ఇంత మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని చెప్పటంతో, అందరూ హంగ్ వస్తుంది అనే అభిప్రాయం చెప్తూ ఉండటంతో, దాన్ని కూడా లగడపాటి కొట్టి పారేసారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చే సమస్యే లేదని.. స్పష్టమైన మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పారు. 2014లో వచ్చినట్టే ఇప్పుడూ కచ్చితమైన తీర్పు వస్తుందన్నారు. ఒక పక్క ఇండిపెండెంట్లు ఎక్కవ గెలుస్తున్నారు అని చెప్పటం, హాంగ్ మాత్రం రాదు అని చెప్పటంతో, లగడపాటి తాను చెప్పాలనుకుంది ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.