లక్ష్యాల సాధన ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇచ్చిన ర్యాంకుల్లో 88.1% స్కోర్‌తో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానం దక్కించుకుంది. ఎ-కేటగిరిలో మొత్తం ఐదు జిల్లాలు, బి-కేటగిరీలో ఎనిమిది జిల్లాలు నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాతో సహా కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలు ఎ-కేటగిరీలో ఉన్నాయి. విశాఖ, విజయనగరం, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాలు బి-కేటగిరీలో ఉన్నాయి. 70.7% స్కోర్‌తో కర్నూలు జిల్లా చిట్టచివరన ఉంది. మరోవైపు నాలుగేళ్ల సరాసరి వృద్ధి రేటులో పశ్చిమ గోదావరి జిల్లా 12.79% వృద్ధితో రాష్ట్రంలో తొలిస్థానంలో ఉండగా, 8.56% వృద్ధితో ప్రకాశం జిల్లా మిగిలిన జిల్లాల కంటే వెనుకబడింది. 2017-18లో 14.75% వృద్ధి రేటుతో ముందువరుసలో పశ్చిమగోదావరి జిల్లా నిలువగా, ఇదే ఆర్ధిక సంవత్సరానికి 9.11% వృద్ధి రేటుతో విశాఖ జిల్లా ఆఖరిస్థానంలో ఉంది. 2017-18 ధరల ప్రకారం రూ. 88,829 కోట్ల జీవీఏతో కృష్ణాజిల్లా తొలిస్థానంలో ఉంది. రూ.25,955 కోట్ల జీవీఏతో విజయనగరం జిల్లా చివరిలో ఉంది.

అలాగే వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. ఫలితాల సాధనలో 150.2% స్కోర్ సాధించి అగ్రస్థానంలో జలవనరుల శాఖ నిలువగా, 20.8% స్కోర్‌తో క్రీడలు-యువజనుల శాఖ అట్టడుగున ఉంది. ఎ-కేటగిరిలో జలవనరుల శాఖ, వ్యవసాయ, సహకార శాఖ, ఉద్యానం, పట్టు పురుగుల శాఖ, సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పర్యావరణం, అటవి శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజెన్ల శాఖ, పశు సంవర్ధక, మత్స్య శాఖలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నాయి. బి-కేటగిరిలో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహ నిర్మాణం, ఇంథన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలు ఉన్నాయి. సి-కేటగిరిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, డి-కేటగిరిలో నిలిచిన క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఉన్నాయి.

2017-18లో రూ. 73,592 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలో విశాఖ జిల్లా మొదటిస్థానంలో, రూ. 70,685 కోట్లతో కృష్ణాజిల్లా రెండోస్థానంలోనూ, రూ. 65,292 కోట్లతో తూర్పగోదావరి జిల్లా మూడవస్థానంలోనూ ఉన్నాయి. రూ.22,045 కోట్ల జీడీడీపీతో విజయనగరం జిల్లా చివరిస్థానంలో ఉంది. 2017-18లో రూ.1,89,121 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో తొలిస్థానంలో కృష్ణాజిల్లా ఉండగా, రూ. 99,792 తలసరి ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా చివరిస్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలు వరుసగా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ తలసరి ఆదాయం రూ.1,12,835 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ. 1,42,054 ఉంది. నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐదు జిల్లాలలో తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా తక్కువ ఉందని, అయితే గత నాలుగేళ్లలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అన్నారు. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తలసరి ఆదాయాన్ని జాతీయ సగటు కన్నా అధిగమించాల్సి ఉందన్నారు. ఈ రెండు జిల్లాల్లో తలసరి ఆదాయం పెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లాల కలెక్టర్లకు, జిల్లాలకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. పండ్లతోటల పెంపకం, పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాయలసీమ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. ఇదే తరహాలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read