దేశ వ్యాప్తంగా వస్తున్న నిరసనలకు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. గతంలో చంద్రబాబు, కలాం పై గౌరవంతో, ఆయన స్పూర్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో, చదువులో ప్రతిభ చూపించిన విద్యార్ధులకు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డు పేరిట ఒక అవార్డు ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డును పేరు మార్చి, వైఎస్ఆర్ ప్రతిభా పురస్కార్ అవార్డుగా మార్చింది. అయితే ఒక మహోన్నత వ్యక్తి పేరు మీద ఉండే అవార్డును, ఒక రాజకీయ నాయకుడు పేరుగా మార్చటంతో, దేశ వ్యాప్తంగా, జగన్ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా, కలాంని అభిమానించే ఎంతో మంది మేధావులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు, ఈ విషయం పై మండి పడ్డారు. జగన్ ప్రభుత్వానికి, ఈ ప్రచార పిచ్చ ఏంటి అంటూ, నిలదీస్తూ, ట్విట్టర్ లో జగన్ ను ట్యాగ్ చేసి, విమర్శలు గుప్పించారు.
అయితే ఈ విషయం పై, తీవ్ర విమర్శలు రావటంతో, జగన్ వెనక్కు తగ్గారు. సియంఓ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార్ అవార్డును పేరు మార్చి, వైఎస్ఆర్ ప్రతిభా పురస్కార్ అవార్డుగా మార్చిన సంగతి, జగన్ మోహన్ రెడ్డికి తెలియదని, ఆయనకు తెలియకుండా, ఈ జీవో విడుదల అయ్యిందని, జగన్ కు ఈ విషయం తెలియటంతో, వెంటనే, ఈ జీవోని రద్దు చెయ్యమని, ఆదేశాలు ఇచ్చారని, చెప్పారు. ఎప్పటిలాగే, ఈ అవార్డులకు, అబ్దుల్ కలాం పేరు పెట్టాలని సూచించారు. అంతే కాకుండా, గాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్ పేర్లతో మరికొన్ని అవార్డులకు మహనీయుల పేర్లు పెట్టాలని జగన్ ఆదేశించారని, ప్రెస్ కు తెలియ చేసారు. ఈ విషయం పై, మీడియాకు సమాచారం అందించారు.
అయితే జగన్ కు తెలియకుండా, ఇంత పెద్ద జీవో బయటకు రావటం ఆశ్చర్యాన్ని కలిగించిన మానదు. ఒకవేళ విమర్శలు రావటంతో, ఇలా బయటకు చెప్పరా అనే అనుమానం కలుగుతుంది. అయితే, అలా కాకుండా, ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక మహానుభావుడి పేరు తొలగించారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ ఏంటో కనిపిస్తుంది. నిన్నటి నిన్న, ఏకంగా చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం, అంతకు ముందు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ నోటీసులు ఇవ్వటం, అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ బిజినెస్ రూల్స్ మార్చేయటం, ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందొ అర్ధమవుతుంది. ఏది ఏమైనా, మళ్ళీ కలాం గారి పేరు పెట్టటం, హర్షించదగ్గ విషయం.