అబ్దుల్ కలామ్ ప్రతిభ అవార్డుల పేరు మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టడం పై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ జీవో వచ్చిందని, ఆయనకు తెలిసిన వెంటనే, ఈ జీవోని రద్దు చేయ్యమన్నారని సిఎంఓ తెలిపింది. దానికి తగ్గట్టె ఈ జీవో రద్దు చేసారు. అయితే, ఓక ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి జీవో వచ్చే పరిస్థితి ఉందా, అనే సందేహాలు కలుగుతున్నాయి. దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. మాజీ ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ, అబ్దుల్ కలామ్ ప్రతిభ అవార్డుల పేరు మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టడం(జీవో 301) ఇంకో తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. "జీవోకు, మెమోకు చాలా తేడా ఉంటుంది.. కార్యదర్శి,మంత్రి సంతకం లేకుండా జీవో రాదు. జీవో ఆర్ టి నెం 301 మీద మంత్రి సంతకం తప్పకుండా ఉంటుంది. ఈ జీవోపై సంతకం పెట్టిన మంత్రి ఎవరు? ఈ జీవోపై ముఖ్యమంత్రి సంతకం కూడా ఉంటుంది. జీవో 301 సమగ్ర వివరాలన్నీ ప్రజలకు వెల్లడించాలి. కలామ్ పేరుమార్పు జీవోపై నిజానిజాలను సీఎం జగన్ బహిర్గతం చేయాలి." అంటూ యనమల ధ్వజమెత్తారు.
యనమల మాట్లాడుతూ, "ఎవరి అనుమతితో జీవో 301 విడుదలైంది..? దానిపై సీఎం జగన్ సంతకం పెట్టారా లేదా..? జీవోపై సంతకం పెట్టమని మంత్రిని ఆదేశించింది సీఎం కాదా..? కొత్తగా నిన్న ఇచ్చిన జీవోపై ముఖ్యమంత్రి సంతకం పెట్టలేదా..? ఎవరి సంతకం,తేది,నెంబర్ లేకుండా ఈ కొత్త జీవో ఏమిటి..? మీరు చేసిన తప్పులకు అధికారులను బలిచేస్తారా..? జీవో 301రద్దు, కొత్త జీవో విడుదల గుట్టుమట్లన్నీ ప్రజలకు వివరించాలి. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. అందులో భాగంగానే అబ్దుల్ కలాం పేరు మార్చడం కూడా.. ఆకస్మికంగా ఎల్ వి సుబ్రమణ్యం బదిలీపై కూడా అనేక అనుమానాలు. సిఎస్ బదిలీపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కుల,మత విద్వేషాలతోనే ఎల్వీ బదిలీ కూడా అంటున్నారు..సిఎస్ ఆకస్మిక బదిలీ లోగుట్టు వెంటనే బైటపెట్టాలి. కులాలవారీగా,మతాలవారీగా సమాజాన్ని చీల్చడమే సీఎం జగన్ లక్ష్యం, తద్వారా రాజకీయలబ్ది పొందడమే వైసిపి దుర్మార్గం." అని అన్నారు.
"కేపిటల్ లేకుండా ఏపి మ్యాప్ విడుదలకు కారణం వైసిపి ప్రభుత్వమే..రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు, సీఎం చర్యలే దీనికి కారణం. రాజధానిని మారుస్తామని, ఎక్కడో కమిటి నిర్ణయిస్తుందని బొత్స వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రమేయంతోనే బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు. రాజధానిని మారుస్తామన్న బొత్స వ్యాఖ్యల నేపథ్యంలోనే మ్యాప్ లో అమరావతిని ఎత్తేశారు. రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ లేదని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. గెజిట్ చూపించేసరికి సైలెంట్ అయ్యారు. ఆ తరువాత రాజధానిపై కమిటి వేశామన్నారు. అన్నిప్రాంతాలవారు దానికి లేఖలు పంపాలని మెయిల్ ఐడి ఇచ్చారు. ఇదంతా జరిగాకే రాజధాని లేకుండా ఏపి మ్యాప్ ఇచ్చారనేది గుర్తించాలి. వైసిపి నిర్వాకాలను టిడిపికి చుట్టాలని చూడటం హేయం. సంక్షేమం కోసం ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇంకో తుగ్లక్ చర్య. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ మేఘా సంస్థకు కట్టబెట్టారు. రివర్స్ టెండర్ అని చెప్పి సింగిల్ టెండర్ కే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలన్నీ వైసిపి నేతలకు ధారాదత్తం. రాష్ట్రాన్ని, భూములను వాటాలు వేసుకుని వైసిపి నేతలు పంచుకున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు." అంటూ యనమల స్పందించారు.