ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరుపై గడిచిన కొద్ది కాలంగా విమర్శలు గుప్పిస్తోంది. అధికార పార్టీకి అండగా నిలుస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. తాము ఇచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు ఇస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టింగులపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, పోలీసులు బనాయించిన కేసులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన కొందరు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి.
మొత్తం పోలీసు వ్యవస్థనే కించపరుస్తున్నారంటూ పోలీసు అధికారుల సంఘం చంద్రబాబుపై ధ్వజమెత్తింది. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, కేవలం కొందరు పోలీ సు అధికారుల తీరును మాత్రమే తమ అధినేత చంద్రబాబు తప్పుపట్టారని దీనినే మొత్తం వ్యవస్థకు అపాదించడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తఫా, విడదల రజనీ గుంటూరులోని అరండల్పేట పోలీసు స్టేషన్లో పోలీసు వ్యవస్థను కించపరుస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా ముదిరింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆయన పార్టీ పేరు ప్రస్తావించకుండా ఇదంతా ఆ పార్టీ మీడియా షో అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా చంద్రబాబు రాసిన లేఖలపై స్పందిస్తూ తనకు నేరుగా లేఖలు అందించకుండా తొలుత మీడియాకు విడుదల చేసి ఆ తర్వాత పార్టీ నేతలతో పంపిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇవన్ని రాజకీయ కోణంలో చేస్తున్న ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఎటువంటి పక్షపాతం లేకుండా తనకు అందిన ప్రతి ఫిర్యాదుపై స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డీజీపీ సవాంగ్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో పాటు డీజీపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఒకవైపు అధికార పార్టీ నేతలు, శ్రేణుల దాడుల్లో తమ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయాలపాలవుతుంటే మీడియా షో అంటారా..? అంటూ విరుచుకుపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై 26 ఎంక్వెయిరీలు నిర్వహించారని అయినప్పటికి ఏమి సాధించలేకపోయారన్న విషయాన్ని గుర్తెర గాలన్నారు. అధికారం శాశ్వతం కాదని పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై డీజీపీతో పాటు పోలీసు అధికారుల సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.