కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు భేటీ అయ్యారు. అమరావతి రాజధానిగా చూపిస్తూ, సవరించిన మ్యాప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇండియా మ్యాప్ లో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూపించక పోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 రోజుల దాకా పట్టించుకోక పోవటంతో, పార్లమెంట్ మొదలైన వెంటనే, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయం పై, పార్లమెంట్ లో లేవనెత్తారు. అమరావతిని గుర్తించక పొతే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదని, అమరావతిని శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీకి అవమానం అని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కోరారు. దీనికి సంబంధించి బాధ్యత హోం శాఖది కావటంతో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ, వెంటనే తప్పు సరిదిద్దుతామని చెప్తూ, తప్పుని అంగీకరించటమే కాక, చెప్పినట్టే, కేవలం ఒక్క రోజులోనే తప్పుని సరిదిద్ది, కొత్త మ్యాప్ విడుదల చేసారు.
దీంతో తెలుగుదేశం పార్టీ వెంటనే, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. చంద్రబాబు కూడా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి, ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపధ్యంలోనే, అడిగిన వెంటనే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడినందుకు, ఈ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధన్యవాదాలు చెప్పారు. కలిసిన వారిలో, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి ఉన్నారు. అయితే వీరి భేటీ కేవలం దీనికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు పై ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో రౌడీ రాజ్యం నడుస్తుందని, ఫిర్యాదు చేసారు.
తెలుగుదేశం పార్టీ కార్యక్తల పై, నేతల పై, ఇప్పటికీ దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయని, ఇప్పటి వరకు 640 మంది పై దాడులు జరిగాయని అన్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారని, వారి ఇళ్ళ ముందు గోడలు కట్టటం, పంటలు నరికేయటం, లాంటి చర్యలకు పాల్పడుతూ, ఊరు విడిచి వెల్లిపోయేలా చేస్తున్నారని, ఇప్పటికే ఈ విషయం జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసామని, మరిన్ని వివరాలతో, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాల పై ఫిర్యాదు చేస్తామని, అమిత్ షా కు తెలిపారు. దీనికి స్పందించిన అమిత్ షా, జరుగుతున్న విషయాలు అన్నీ మాకు తెలుసని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, మాకు ఉన్న పరిమితుల్లో, మేము స్పందిస్తామని చెప్పినట్టు తెలుస్తుంది.