తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదటి సారి స్పందించారు. సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడటం తనను కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో మాట్లాడుతూ తెలంగాణాలో జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యల పై స్పందించారు. బలవంతంగా చనిపోవటంతో సమస్యలు పరిష్కారం కావన్నారు, జీవితం ఎంతో విలువైనదని,బతికి సాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని సూచించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి సాధించాలని చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికులంతా సంయమనంతో ఉండాలని చంద్రబాబు అన్నారు. ఇక మరో పక్క ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ చేసారు.
"తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో బలవన్మరణం చేసుకోవడం నా మనసును కలచివేసింది. జీవితం ఎంతో విలువైనది. దేన్నైనా బతికి సాధించాలి తప్ప బలవన్మరణం అనేది పరిష్కారం కాదు. కార్మికులందరూ మీ కుటుంబాల గురించి ఆలోచించి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక మరో పక్క, తెలంగాణా ప్రభుత్వం మాత్రం సమ్మె పట్ల మొండి వైఖరి కొనసాగిస్తూనే ఉంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చర్చలు జరిపినట్టు వచ్చిన కథనాల పై తెలంగాణా సీఎంవో స్పందించింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో మేము ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది.
గత పది రోజులగా తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. తమ ఉద్యోగాలు, భవిష్యత్తు పై నమ్మకం లేక, ప్రభుత్వ వైఖరికి విసుగు చెంది, ఇప్పటికి ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణం చేసుకున్నారు. కార్మికులు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోవడంతో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రోజు రోజుకీ పరిస్తితి అదుపు తప్పుతూ ఉండటంతో, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం మొండిగా, మేము చర్చించేది లేదు, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసాం అని చెప్తూ ఉండటం, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విషయం పై, చంద్రబాబు తన స్పందన తెలియ చేస్తూ, ధైర్యంగా పోరాడాలని, బలిదానాలు వద్దని, ఆర్టీసీ కార్మికులను కోరారు.