తెలుగు భాష పై రగడ నడుస్తున్న వేళ, అవధాని గరికపాటి గారు, ఈ విషయం పై స్పందించారు. ఇది అయన స్పందన.. "ఈ రోజు ఎంతో గొప్ప భాష అయిన తెలుగు భాషకు, ముప్పు ఏర్పడిందని, గత వారం రోజులుగా అందరూ చర్చించుకుంటున్న విషయం. దీనికి ఒక భాష వేత్తగా, సాహిత్య వేత్తగా, అవధానిగా, నాకు ఈ విషయం పై చెప్పటానికి హక్కే కాదు, బాధ్యత కూడా ఉంది. ప్రశ్నించిన వాడిని ప్రతి వారిని, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి మాటలు, పెద్ద వాళ్ళ నోట అసలు రాకూడదు. ఆ మాటకి వస్తే, నాకు ఈ విషయం పై, అడిగే అర్హత ఉంది. మా పిల్లలు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదివి, ఉన్నత స్థితికి వచ్చారు. అందుకే నాకు అడిగే హక్కు ఉందని అనుకుంటున్నా. అసలు ఇది సరైన ప్రశ్నే కాదు. తెలుగు గురించి అడిగిన ప్రతి వారిని, మీ పిల్లలు ఎక్కడ చదివారు అంటూ, పెద్దా చిన్నా తేడా లేకుండా, దేశంలోనే అత్యున్నత స్థితిలో ఉన్న వారు, దేశ క్షేమాన్ని, భాషా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, వారిని కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉంటే, అది మొండి తనం అవుతుంది కాని, వారి ప్రశ్నకు జవాబు చెప్పటం అవ్వదు.
"అసలు తెలుగు మీడియం వద్దు, తెలుగు ఒక సబ్జెక్ట్ చాలు, మొత్తం ఇంగ్లీష్ మీడియం చేసేద్దాం అనేవారు అందరూ, ఇక నుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడి, మీ ప్రేమ చూపించండి. మీ రాజకీయ ఉపన్యాసాలు, ఓట్లు అడగటాలు, పాదయాత్రలు, ఇవన్నీ ఇంగ్లీష్ లోనే చేసి, ప్రజలతో ఇంగ్లీష్ ఉపన్యాసాలే ఇవ్వండి. తెలుగులో చెయ్యకండి. అప్పుడు ఎవరికీ అర్ధం అవుతుందో చూద్దాం. అలా కాదు, సామాన్య జనాలకి అర్ధం కావలి అంటే, తెలుగులోనే చెప్పాలి అని రాజకీయ నాయకులు అంటే, సామన్య జనాలకు అర్ధం కావాలంటే, మరి పాఠాలు కూడా తెలుగులోనే చెప్పాలి కదా. మొండిగా మీరు ఒకటంటే, అవతలి వారు కూడా మొండిగానే మాట్లాడతారు. ప్రశ్నించుకుంటూ కూర్చోవటం కాదు. ఎక్కడ ఇబ్బంది ఉందొ చూడండి. ప్రభుత్వ స్కూల్స్ లో , ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అనే పిల్లల తల్లి తండ్రులు కూడా ఆలోచించండి. "
"ఆ ఇంగ్లిష మీడియంలో చదివి , ఇంజనీరింగ్ చేసిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు, వారికి ఉద్యోగాలు వచ్చాయా అని ఆలోచించండి. ఉన్నవాళ్ళు అందులో జయం సాధించటానికి, వారికి ఇంగ్లీష్ సామర్ధ్యం కారణం కాదు, ఇంజనీరింగ్ లో సామర్ధ్యం ఉండటం వారికి కలిసి వచ్చింది. ఒక వ్రుత్తి పని ఏదైనా బాగా చెయ్యగలిగిన వాడిని, భాష ఏది ఆపలేదు. భాష అభివృద్ధిని ఆపలేదు, కాని సహకరిస్తుంది. ఒక మాతృభాష సహకరించినట్టుగా, మరొకటి సహకరించదు. రేపు మొత్తం ఇంగ్లీష్ అని చెప్పినా, పాఠాలు మాత్రం తెలుగులోనే చెప్తారు చూస్తూ ఉండండి. 20-30 ఏళ్ళ నుంచి చక్కటి తెలుగు పాఠాలు చెప్తున్న టీచర్స్ కూడా, ఒకేసారి ఇంగ్లీష్ చెప్పమంటే, వారు ఏమి నేర్చుకుంటారు, పిల్లలకు ఏమి చెప్తారు. ఇదంతా ఒక మహా మాయ జరుగుతుంది. తెలుగు భాషని గౌరవించాల్సిందే." అని గరికపాటి అన్నారు.