గత వారం రోజుల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో, గన్నవరం నియోజకవర్గం రాజకీయ వేడి, హాట్ హాట్ గా సాగుతుంది. నాలుగు రోజుల క్రితం వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పేటి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. అప్పటి నుంచి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే ఉన్నాయి. ఇవి ఒక పక్క ఉండగా, ఇప్పుడు వంశీ పార్టీ మారతారా లేక తటస్థ ఎమ్మెల్యేగా ఉంటారా ? ఒకవేళ పార్టీ మారితే రాజీనామా చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చలోకి వస్తుంది. రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, రాజీనామా చెయ్యాల్సిందే అంటూ, చెప్పుకొచ్చారు.ఎవరైనా పార్టీ మారితే, రాజీనామా చెయ్యాల్సిందే అని, దాంట్లో రెండో ఆలోచనల లేదని చెప్పారు. దీంతో ఇప్పుడు వంశీ రాజీనామా ఖాయంగా తెలుస్తుంది. ఆయాన రాజీనామా చేస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ మొత్తం నేపధ్యంలో, ఇప్పుడు గన్నవరం రాజకీయం, హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నా, యార్లగడ్డ వెంకట్రావ్ తదుపరి అడుగులు ఏమిటి అనేది కూడా ఆసక్తిగా మారింది.
వంశీ రాకను వ్యతిరేకిస్తూ యార్లగడ్డ, పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేసారు. అనుచరులుతో కలిసి, సమావేశం అయ్యి, చర్చించారు కూడా. అయితే నిన్న యార్లగడ్డ వెంకట్రావ్, వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. మంత్రులు పెర్ని నాని, కొడాలి నానితో కలిసి, యార్లగడ్డ వెంకట్రావ్ జగన్ ను కలిసారు. వంశీ రాక ఖయామని, ఉప ఎన్నికలు వస్తే వంశీకే సీట్ ఇస్తానని జగన్ చెప్పినట్టు సమాచారం. ఇదే నేపధ్యంలో, యార్లగడ్డ వెంకట్రావ్ కు, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. నిన్న జగన్ ను కలిసి కొంచెం మెత్తబడిన యార్లగడ్డ, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, వంశీ మీ పార్టీలోకి వస్తున్నారు కదా, మీ పరిస్థితి ఏమిటి, పార్టీ మారతారా అని అడిగారు.
దీనికి యార్లగడ్డ సమాధానం ఇస్తూ, ‘నాకు క్యారక్టర్ ఉంది నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు’ అంటూ పంచ్ వేసారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేసారు, వంశీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారా అనే చర్చ జరుగుతంది. వంశీ మీతో కలిసి పని చేస్తారు అని అన్నారు అని చెప్పగా, వంశీ ఇంకా పార్టీలో చేరలేదు కదా, వంశీ వచ్చిన తరువాత చూద్దాం అంటూ, మీడియా వారికి యార్లగడ్డ సమాధానం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి మా బాస్, ఆయన ఏమి చెప్తే అదే అంటూ యార్లగడ్డ సమాధానం చెప్పారు. వంశీ ఉన్నాడని నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు క్యారక్టర్ ఉంది నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు అంటూ యార్లగడ్డ స్పందిచటం చూస్తుంటే, వంశీ రాక పై, అయన ఎంత అసహనంగా ఉన్నారో తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు అందరూ కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి.