గత వారం రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన ని, చంద్రబాబు దత్తపుత్రుడు, టీం బీ, ఒకే డీఎన్ఏ, ఇలా అనేక విధాలుగా, పవన కళ్యాణ్ ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ రోజు విశాఖలో జరిగిన ‘లాంగ్ మార్చ్’ సందర్భంగా జరిగిన జనసేన బహిరంగ సభలో, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు కేవలం, జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ మొదటిసారి, విజయసాయి రెడ్డి పై, ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండున్నరేళ్లు జైళ్లో ఉన్న నాయకులు కూడా తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిధి దాటి మాట్లాడితే, ఎవరిని ఉపేక్షించే పని ఉండదు అంటూ, పవన్ హెచ్చరించారు.
"సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా నన్ను విమర్శిస్తున్నారు. విజయసాయి రెడ్డి గారికి చెప్తున్నాను. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడిపోయే వ్యక్తిని కాదు నేను. మహానుభావులు కూర్చొనే రాజ్యసభలో సూట్ కేసుల కంపెనీలు పెట్టిన విజయసాయి రెడ్డి గారు కూర్చొన్నారు. విజయసాయి రెడ్డి మీరు మాట్లాడితే దత్తపుత్రుడు ,DNA అని మాట్లాడతారు.... అసలు నా DNA గురించి మాట్లాడే హక్కు ఎవడికి , ఏ వైసీపీ నాయకుడికి లేదు..... మీకు నా గురించి మాట్లాడే అర్హత, స్థాయి కూడా లేదు. నాది ఏ డీఎన్ఏ అని తెలిసి, నీ కూతురు పెళ్ళికి పిలిచారు, విజయసాయి రెడ్డి గారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన వైసీపీ మంత్రులకు ప్రజల టాక్స్ డబ్బులు నుండి వచ్చిన జీతాలను తీసుకునే హక్కు లేదు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేసిన తర్వాత వైసీపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్తాను." అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసారు.
టంగుటూరి ప్రకాశం పంతులులా కాల్చమని ఎదురెళ్లి జైలుకెళ్లారా వీళ్లు అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే మంత్రి కన్నబాబు పై కూడా పవన్ కళ్యాణ్ విమర్శించారు. కన్నబాబుని మేము రాజకీయాల్లోకి తీసుకొచ్చామని, నాగబాబు తీసుకొస్తే కన్నబాబు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అలాంటి కన్నబాబు కూడా తనను విమర్శిస్తున్నారని, వాళ్ల బతుకులు తమకు తెలియవా? అని మండి పడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సమస్య పై, ప్రభుత్వానికి రెండు వారల గడవు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. భవన్ నిర్మాణ కార్మికుల ఫండ్ 1200 కోట్లు ఉందని, దాని నుంచి ఒక్కో కార్మికుడికి 50 వేలు ఇవ్వాలని పవన్ అన్నారు. అంతే కాకుండా, 36 మంది చనిపోయారని, వారికి 5 లక్షలు పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు.