తెలుగుదేశం పార్టీలో గెలిచిన 23 మంది నేతల పై, ఎలా అయినా అనర్హత వేటు వేయించాలనే ఉద్దేశంతో, ఏవేవో పిటీషన్లను, హైకోర్ట్ లో దాఖలు చేసింది వైసీపీ. సాక్షాత్తు చంద్రబాబు పైనే, ఇలాంటి కేసు మోపారు. చంద్రబాబు గతంలో సియంగా ఉంటూ జీతం తీసుకున్నారని, కాని ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం, వ్రుత్తి దగ్గర పొలిటీషియన్ అని పెట్టారని, జీతం తీసుకున్న వివరాలు పెట్టలేదు అని, చంద్రబాబుని అనర్హుడిగా ప్రకటించాలని, కోర్ట్ కు వెళ్ళింది వైసీపీ. ఇలా దాదపుగా ఏడుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేల పై కోర్ట్ కు వెళ్లారు. ఇవన్నీ ఏదో రాజకీయ పరమైన కేసులే అని ఇట్టే అర్ధమవుతుంది. అయితే ఈ విషయం పై కోర్ట్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, అప్పటి వరకు ఎదురు చూద్దాం. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడదాం అనుకుంటే, ఇప్పుడు ఇలాంటి కేసులోనే, వైసిపీ ఎమ్మెల్యే బుక్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దీన్నే కర్మ ఫలం అంటారేమో.
ఏకంగా రాష్ట్రపతి భవన్ నుంచి, ఈ ఆదేశాలు వచ్చాయి. గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కుల ధ్రువీకరణ పై ఇప్పుడు వివాదం రేగింది. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావటంతో, అసలు సమస్య మొదలైంది. ఆమె కులం విషమై రచ్చ మొదలైంది. చట్ట ప్రకారం దళితులు, మతం మార్చుకుంటే, వారి కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ హక్కులు కోల్పోతారు. సరిగ్గా ఇదే ఈమె విషయంలో వర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వినాయక చవితి వేడుకల్లో, జరిగిన వివాదం సందర్భంగా, తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై అసలు రగడ మొదలైంది. లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరానికి చెందిన వారు, ఈ విషయం పై కోర్ట్ లో కేసు వెయ్యటమే కాకుండా, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసారు.
అయితే ఈ ఫిర్యాదు పై ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయం స్పందించటం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగం పై వచ్చిన ఫిర్యాదు పై, పూర్తీ స్థాయిలో విచారణ జరిపి, తమకు రిపోర్ట్ ఇవ్వాలని, రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోవటంతో, ఈ విషయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణం, వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వివాదం. వినాయక చవితి పందిరి వద్దకు ఎమ్మెల్యే శ్రీదేవి పై అక్కడ హిందువులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, దళితులను అవమానించారు అంటూ రచ్చ చేసి, జగన్ మోహన్ రెడ్డి, వద్ద పంచాయతీ పెట్టి, ఆ గ్రామానికి చెందిన కొంత మంది, టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. అయితే ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు వీడియో చూపిస్తూ, ఆమె పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా చెల్లవని పలువురు వాదించటంతో, ఆ సంఘటన ఆధారంగా తీసుకుని, ఆమె పై లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం పిటీషన్ వేసింది. ఇవన్నీ నిజమే అయితే, ఆమె ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాసం ఉంది.