హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విషయం సాధించిన సందర్భంలో, కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా రోజుల తరువాత కేసీఆర్ మాట్లాడటంతో, ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, ఆర్టీసి సమ్మె పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తదితర అంశాల పై ప్రజలు ఆసక్తిగా ప్రెస్ మీట్ విన్నారు. అయితే, అటు ఆర్టీసి వర్గాలను, ఇటు జర్నలిస్ట్ లను, అటు ప్రతిపక్షాలను, అందరినీ కలిపి, తిట్టి తిట్టి పెట్టారు కేసీఆర్. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం లేదని, తిన్నది అరగక, ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. అసలు ఆర్టీసినే కనుమరుగు అవుతుంటే, ఇంకా యూనియన్ లు, స్ట్రైక్ లు ఏంటి అని కేసీఆర్ అన్నారు. వారితో చర్చలు జరిపే పనే లేదని, వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తేల్చి చెప్పారు. ఇది యూనియన్ ఎన్నికల ముందు, వాళ్ళు చేస్తున్న పనికి మాలిన సమ్మె అంటూ, ఆర్టీసి ఉద్యోగులుని తిట్టి పోశారు కేసిఆర్.
యూనియన్ ఎన్నికలు వచ్చిన ప్రతి సారి, ఇలాంటి పనికిమాలిన సమ్మెలు చేస్తూ, గొంతెమ్మ కోర్కెలు కోరతారని అన్నారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్కరికీ 50 వేలు జీతం వస్తుందని, ఇంకా కోర్కెలు ఉన్నాయని అన్నారు. ఆర్టీసిని నష్టాల బాట పట్టించి, మా మీద పడితే మేము ఏమి చేస్తాం అని అన్నారు. మా కాళ్ళు మేమే నరుకుట్టాం అని అంటే ఏమి చేస్తాం అని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల వైఖరిని తాను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించనని కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసికి సంబంధించి, నాకంటే, ఎవరికీ ఎక్కువ తెలియదు అని కేసీఆర్ అన్నారు. ఎవరు పడితే వారొచ్చి, గవర్నమెంట్‌లో కలపమంటే కలుపుతారా అని కేసీఆర్ అన్నారు.
అయితే ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి విలీనం గురించి, విలేఖరులు ప్రశ్నించగా, కేసీఆర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. "జగన్ గురించే చెప్తున్నా.. అక్కడ మన్ను కూడా అవ్వదు... అక్కడ ఆర్టీసి విలీనీం జరగలేదు.. ఆర్టీసి విలీనీం అనేది అసంభవం.. అక్కడ ఏదో ప్రయోగం చేసారు. నేను చెప్తున్నానుగా కధ.. ఎప్పుడో వస్తుంది అంట రిపోర్ట్, మూడు నెలలో, ఆరు నెలలో.. అది వచ్చినప్పుడు చూద్దాం.. ఇది అయ్యే పని కాదు.. ఎక్కడా జరగదు..." అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం కమిటీలతో కాలయాపణ చేస్తారు అనే ఉద్దేశంగా కేసిఆర్ మాట్లాడారు. మరి ఈ విషయం పై, జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన సంఘాలు, కార్మికులు ఏపి ప్రభుత్వం నుండి స్పష్టత తెచ్చుకునే అవసరం ఎంతైనా ఉంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఏపి ప్రభుత్వం స్పందించాలి..