ఇక్కడ కప్పు కాఫీ కూడా దొరకటం లేదు, కనీస ఏర్పాట్లు కూడా చెయ్యటం లేదు, ఇదేమి వైఖరి అంటూ, వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరో సదా సీదా వ్యక్తీ కాదు. ఒక హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్. మన అమరావతిలో ఉన్న హైకోర్ట్ కి ఛీఫ్ జస్టిస్ గా ఉన్న,జస్టిస్ జేకే మహేశ్వరి. అమరావతిలో ప్రస్తుత పరిస్థితి చూసి, ఆవేదన చెంది చేసిన వ్యాఖ్యలు ఇవి. మే 2019 దాకా, అమరావతి ప్రాంతం, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా. దాదపుగా 40 వేల మండి కార్మికులు, ఇక్కడ పని చేసే వారు. అటు శాశ్వత సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ పనులు, మరో పక్క జడ్జి, ఐఏఎస్, ఐపిఎస్, మినిస్టర్ క్వార్టర్స్, ఇలా ఒక కిమీ పొడవునా, కన్స్ట్రక్షన్ ఆక్టివిటీతో ఆ ప్రదేశం కళకళలాడుతూ ఉండేది. ఇక మరో పక్క ప్రైవేటు కాలేజీలు, హోటల్స్ కట్టడాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది. ప్రస్తుత ప్రభుత్వానికి, అమరావతి అంటే ఇష్టం లేదనే విషయం తెలిసిందే.
దీంతో వారు రాగానే, అమరావతి మొత్తం ఆపేశారు. 40 వేల మండి కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమరావతి ప్రాంతం అంతా ఒక నిశబ్ద వాతావరణం అలుము కుంది. సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ జరిగే టైంలో అసెంబ్లీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసే వెళ్ళిపోయే ఘోస్ట్ సిటీగా తయారు అయ్యింది. అయితే, ఈ రోజు హైకోర్ట్ లో, ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ రోజు హైకోర్ట్ లో, అమరావతి స్విస్ చాలెంజ్ పిటిషన్ పై విచారణ జరిగిన సందర్భంలో, ప్రభుత్వ తరుపు న్యాయవాది నాలుగు వారాల పాటు వాయిదా కోరారు. దీంతో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కేసు వాయిదా వేసిన తరువాత, తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అసలు అమరావతి పై మీ వైఖరి ఏంటి, ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
జడ్జిలకు క్వార్టర్స్ కూడా లేవు, కనీసం కప్పు కాఫీ తాగటానికి సదుపాయాలు లేవని, ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందా? లేదా? అమరావతి పై మీ వైఖరి ఏంటి అంటూ, ప్రభుత్వ న్యాయవాదిని చీఫ్ జస్టిస్ అడిగారు. అయితే ప్రభుత్వ న్యాయవాది ఈ పరిణామంతో షాక్ అయ్యారు. చంద్రబాబు హయంలో జడ్జిలకు క్వార్టర్స్ నిర్మాణం మొదలు పెట్టి, తాత్కాలిక వసతులు కల్పించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ క్వార్టర్స్ నిర్మాణం ఆపేయటంతో, జడ్జిలకు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. అలాగే, హైకోర్ట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ మూత పడింది, దగ్గరలో ఉన్న హోటల్స్ కూడా జనాలు లేక మూత పడ్డాయి. హైకోర్టులో గత ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు కూడా, ఇప్పటి ప్రభుత్వం కల్పించ లేకపోవటంతో, జడ్జిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉండటంతో, చీఫ్ జస్టిస్ ప్రభుత్వ న్యాయవాది పై అసహనం వ్యక్తం చేసారు. మరి ప్రభుత్వం, దీనికి ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.