ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగింది. హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య, తనకు స్కార్ట్ కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా, పోలీసులు పట్టించుకోని ఘటన, టిడిపి శ్రేణుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. నందమూరి బాలకృష్ణ, హిందూపురం వచ్చిన సందర్భంలో, బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనటంతో పాటుగా, నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. బాలయ్య వస్తున్నారని తెలుసుకుని, మార్గమధ్యలో, గలిబిపల్లి గ్రామస్థులు కొడికొండ చెక్ పోస్టు వద్ద, బాలయ్య కారును అడ్డుకున్నారు. లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు పూర్తి చెయ్యాలని, బాలయ్య ఎదుట ఆందోళన వ్యక్తం చేసారు. దీని పై స్పందించిన బాలయ్య, అధికారులతో మాట్లాడి పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. ఇంత ఘటన జరిగినా, పోలీసులు ఎవరూ అక్కడకు రాలేదు.
అయితే, ఈ సంఘటన వైసీపీ నాయకులు వెనుక ఉండి నడిపించారని, స్థానిక టిడిపి నేతలు భావిస్తున్నారు. బాలయ్య పర్యటన మొత్తం, ఇలా సమస్యల పేరుతొ అడ్డుకోవాలని స్కెచ్ వేసినట్టు సమాచారం ఉందని, వైసీపీ ప్రభుత్వం ఉంటూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు అవ్వకుండా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ నేపధ్యంలోనే, బాలయ్య తిరిగి బెంగుళూరు వెళ్ళే సమయంలో, సెక్యూరిటీ కావలని అడిగారు. తనకు, ఎస్కార్ట్ కావాలని పోలీసులకు స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి అడిగారు. అయినా పోలీసులు రాలేదు. అరగంట పైన వెయిట్ చేసిన బాలయ్య, చివరికి ఆయన ఒక్కరే తన వాహానంలో బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళారు. బాలయ్య శుక్రవారం తన నివాసంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మూడు స్టేషన్లకు సమచారం అందించారు. అయినా ఎవరూ అక్కడికి రాలేదు.
బాలక్రిష్ణకు జరిగిన ఈ అవమానం పై టిడిపి నాయకులు, బాలయ్య అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. గతంలో బాలకృష్ణ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పెనుకొండ డిఎస్పీతో పాటు సిఐలు అందరు ఉండి ప్రోటోకాల్ పాటించేవారు. ప్రస్తుతం ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కనీసం విమానాశ్రాయానికి వెళ్ళే సమయంలోనైనా ఎస్కార్ట్ గా రావాడం లేదని తనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేనే కాదు సెలబ్రిటీ కూడా అని అన్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇవ్వక పోయినా కనీసం ఒక సెలబ్రిటీకి ఇచ్చే కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.