కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అమరావతి పై అనేక వార్తలు వస్తున్నాయి. ఒక మంత్రి వచ్చి ఇక్కడే రాజాధాని అంటారు. ఇంకో మంత్రి ఇక్కడ కాదు అంటారు. ఇంకో మంత్రి పరిశీలిస్తున్నాం అంటారు. మరో మంత్రి భ్రమరావతి అంటారు. మరో మంత్రి హైమావతి అంటూ ఎగతాళి చేస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, అమరావతి పై ప్రకటనలు చేస్తూ, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు ప్రకటన చెయ్యాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇంత గందరగోళం జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇక ఒక 15 రోజులు నుంచి మరో వార్త వినిపిస్తుంది. ఇప్పుడు వెలగపూడిలో ఉన్న సచివాలయం, హైకోర్ట్ తరలిస్తున్నారని, సచివాలయాన్ని మంగళగిరి, హైకోర్ట్ ను రాయలసీమకు తరలిస్తున్నాం అంటూ, లీకులు ఇస్తున్నారు. ఇక మరో పక్క బీజేపీ లాంటి పార్టీతో పాటు, వైసీపీలోని ఒక వర్గం, హైకోర్ట్ రాయలసీమలోనే పెట్టాలని అంటున్నారు. కొంత మంది హైకోర్ట్ మారిపోతుంది అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు.
దీంతో రాష్ట్రంలోని న్యాయవాదులు అంతా ఆందోళన బాట పట్టారు. దసరా పండుగ ముందు నుంచి ఆందోళనలు చేస్తూ, హైకోర్ట్ అమరావతిలోనే ఉంచాలని ఇక్కడి వారు విధులు మానేసి ఆందోళన చేసారు. మరో పక్క హైకోర్ట్ రాయలసీమలో పెట్టాలని అక్కడ న్యాయవాదులు, విధులు మానేసి ఆందోళన చేసారు. మరో పక్క ఉత్తరాంధ్ర న్యాయవాదులు, విధులు మానేసి, హైకోర్ట్ ఇక్కడే పెట్టాలి అంటూ, వారు కూడా ఆందోళన చేసారు. మొత్తానికి, దాదపుగా ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే, ఇదే అంశం పై, రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా, హైకోర్ట్ లో ఉన్న టెక్నాలజీ ఉపయోగించి, రాష్టవ్య్రాప్తంగా ఉన్న జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదుల ప్రతినిధులతో, నేలాపాడు హైకోర్టు నుండి జస్టిస్ మహేశ్వరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర హైకోర్టును అమరావతిలోని నేలపాడు నుండి తరలిస్తున్నారన్న అంశం కేవలం ఊహాగానమే అని, రాజకీయ నాయకుల ట్రాప్ లో పడి, న్యాయవాదులు, ఇటువంటి వదంతులపై ఉద్యమాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అసలు హైకోర్ట్ తరలింపు అంశం రాష్ట్రం చేతిలో ఉండదని, రాష్టప్రతి, కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం అని అన్నారు. అక్కడ నుంచి హైకోర్ట్ తరలింపు పై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి వారు తమకే హైకోర్టు కావాలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది న్యాయవాదులు, అమరావతిలోనే హైకోర్ట్ ఉండటం సమంజసం అని చెప్పటంతో, ఇదే విషయం కేంద్రప్రభుత్వానికి, రాష్టప్రతికి విన్నవించాలని వారు చీఫ్ జస్టిస్ ను కోరారు.