విజయనగరం బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధరణకు జాయింట్ కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగారు. పల్లెటూరి రైతు వేషం ధరించిన జేసీ కిశోర్ కుమార్... రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో కూరగాయలు కొన్నారు. అన్ని సరుకులు, దుకాణాల వద్దకు వెళ్లి సాధారణ వినియోగదారునిలా ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు జరుగుతున్నాయని, ఉల్లి, టమాటాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించామని జేసీ కిశోర్ తెలిపారు. అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారంటూ విజయనగరంలోని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజనిజాలు తెలుసుకునేందుకు జేసీ కిశోర్ కుమార్ మారువేషంలో మార్కెట్‌కు వెళ్లారు. పల్లెటూరి రైతు వేషంలో వెళ్లి ధరలు అడిగి తెలుసుకున్నారు. టమాట, ఉల్లిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆయన తెలిపారు.
మరో పక్క, విజయనగరంలో నిత్యావసరాలు, కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్‌ను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పరిశీలించారు. వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన వచ్చిందని, రైతు బజార్ల వద్ద క్యూలైన్లో వెళ్తూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి రైతు బజార్ వద్ద పోలీసులను నియమించి, వ్యక్తుల మధ్య దూరం ఉండే విధంగా చూస్తున్నామన్నారు.
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపర్లు ఎదుటివారిపై పడి కరోనా వ్యాప్తి చెందుతున్నందున చేతి రుమాలును అడ్డం పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లు, నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద గడులను ఏర్పాటు చేసి, వాటిలో నిలబడి వస్తువులను కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.