గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ, గత రెండు మూడు రోజలుగా, ఆంధ్రప్రదేశ్ర్ రాజకీయం తిరుగుతుంది. నాలుగు రోజులు క్రిందట చంద్రబాబుని కలిసి తన కష్టాలు చెప్పుకోవటం, తరువాత రోజు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కలవటం, ఆ తరువాత రోజు జగన్ మోహన్ రెడ్డిని కలవటం, తరువాత రాజకీయాలకు దూరం వెళ్తున్నట్టు చెప్పటం, ఇవన్నీ గందరగోళానికి దారి తీసాయి. పది రోజుల క్రిందట వంశీ పై పెట్టిన నకిలీ పట్టాల కేసు నుంచి మొదలైన ఈ గొడవ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఆ నకిలీ పట్టాల కేసులో, వంశీ దొరికిపోయారని, వంశీ అరెస్ట్ కు, పోలీసులు స్పీకర్ వద్ద పర్మిషన్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వంశీ అరెస్ట్ తప్పదు అనుకున్న టైంలో, మొత్తం రివర్స్ అయ్యి, విషయం మొత్తం వంశీ ఏ పార్టీలో చేరుతారు అనే విషయం చుట్టూ తిరుగుతుంది. అయితే వంశీ పై పెట్టిన కేసు ఏమైందో, పోలీసులు ఏమైపోయారో ఇప్పటికీ తెలీదు...
అయితే వంశీ, చంద్రబాబు మధ్య నిన్నటి నుంచి, లేఖలు నడుస్తున్నాయి. వంశీ పార్టీ మారుతున్నా, ఒత్తిళ్ళు తట్టుకోలేను అని చెప్పటం, దానికి చంద్రబాబు కలిసి పోరాడదాం అని చెప్పటం, ఇలా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు సూచన మేరకు, కేశినేని నాని, కొనకళ్ళ నారయణ, వంశీతో చర్చలు జరపటానికి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పరిస్థితి ఇలా ఉంటే, అటు వైసిపీలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పటికే అక్కడ ఉన్న యార్లగడ్డ వెంకట్రావు, వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఇంటి వద్ద 4 వేల మండి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు జగన్ తో భేటీ ఉంటుందని, అక్కడ తేల్చుకుందాం అని వెంకట్రావ్ అనుకున్నా, ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఇది వైసిపీ పరిస్థితి.
వంశీ మూడు పార్టీల నేతలను రెండు రోజుల గ్యాప్ లో కావటంతో, అటు టిడిపి వెనక్కు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే, వైసీపీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. ఇక మిగిలింది బీజేపీ. వంశీ బీజేపీలో చేరటానికి కూడా ఆలోచన చేసారు. సుజనా చౌదరిని గుంటూరు వెళ్లి మరీ, ఒక బీజేపీ నేత ఇంట్లో కలిసారు. అయితే అనూహ్యంగా ఆ తరువాత రోజే జగన్ ను కలవటంతో, వంశీ బీజేపీలో చేరటం లేదని అర్ధమైంది. అయితే వంశీ తనను ఎందుకు కలిసారు, అనే విషయం పై ఈ రోజు సుజనా చౌదరి స్పందించారు. వంశీ తనను కలిసారని, తాను ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పారని, బీజేపీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది వంశీనే అని సుజనా అన్నారు. సామర్ధ్యం, సమర్ధత ఉన్న నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని సుజనా చౌదరి అన్నారు.