జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన, ఆశాజనకంగా జరగలేదు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో, వివిధ కేంద్ర మంత్రులను కలవాలని జగన్ నిర్ణయం తీసుకుని, నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. నిన్నంతా ఢిల్లీలో తన అధికార నివాసానికి పరిమితమైన జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా ఆఫీస్ నుంచి పిలుపు కోసం ఎదురు చూసారు. అయితే, నిన్నంతా జగన్ కు కబురు రాకపోవటంతో, ఆయన తన అధికార నివసానికే పరిమితం అయ్యారు. అయితే, ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో, జగన్, అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమి రెడ్డి తదితరులు కూడా, జగన్ వెంట వెళ్లారు. అయితే అమిత్ షా తో, జగన్ భేటీ పై, సిఎంఓ ఇచ్చిన ప్రకటనలో, 40 నిమిషాల పాటు భేటీ జరిగిందని, వివిధ సమస్యల పై ఇరువురూ చర్చించుకున్నారని తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అంత సేపు భేటీ జరగలేదని తెలుస్తుంది.
కొన్ని తెలుగు మీడియా ఛానెల్స్ లో ఈ విషయం పై, వార్తలు వస్తున్నాయి. ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు కావటంతో, ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. ఆయనకు శుభాకాంక్షలు చెప్పటానికి, సహచర మంత్రులు, నేతలు, కార్యకర్తలు రావటంతో, ఆయన కార్యాలయం సందడిగా మారింది. ఇదే సమయంలో జగన్ తో పాటు, ఇతర వైసీపీ నేతలు, అమిత్ షా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, వచ్చేసారని, జగన్ మోహన్ రెడ్డి, సమస్యల పై ఒక మెమోరాండం ఇచ్చారని సమాచారం. 11 గంటలకు, అదీ అమిత్ షా పుట్టిన రోజు నాడు, అంత కోలాహలంగా ఉన్న చోట, జగన్ తో 40 నిమిషాలు భేటీ అనేది, కుదిరే పని కాదని అంటున్నారు. దీంతో అమిత్ షా తో పూర్తీ స్థాయి సమావేశం జరగలేదని, కేవలం విష్ చేసి, మెమోరాండం ఇచ్చి వచ్చేసారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే, జగన్ తో, అమిత్ షా భేటీ జరగలేదు అని తెలియగానే, కేంద్ర మంత్రులు రవిశంకర్, ప్రహ్లాద్‌జోషి కూడా జగన్ తో అపాయింట్మెంట్ రద్దు చేసుకోవటం, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 12:30 గంటలకు కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ తో, అలాగే కేంద్ర బొగ్గు శాఖా మంత్రి, ప్రహ్లాద్‌జోషితో, 3 గంటలకు జగన్ కు అపాయింట్మెంట్ ఉంది. ఇవి రెండు రద్దు కావటం సంచలనంగా మారింది. మరో పక్క కేంద్ర జల శక్తి మంత్రిని, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రిని కలవాలి అనుకున్నా, వారు ముందు నుంచి అందుబాటులో లేరు. అయితే ఈ సారి జరిగిన ఢిల్లీ పర్యటన పై జగన్ పూర్తీ అసంతృప్తిలో ఉన్నారని, రెండు రోజులు ఎదురు చూసినా, పూర్తిస్థాయి మీటింగ్ జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారని తెలుస్తుంది. ఈ పరిణామాలతో, అర్థాంతరంగా పర్యటన ముగించుకున్న జగన్, మరికాసేపట్లో ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరి రానున్నారు.