ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి, నాయకులను లాక్కునే పనిలో బీజేపీ బిజీగా ఉంది. నిన్న సడన్ గా, నలుగురు రాజ్యసభ ఎంపీలను లాక్కుని, పార్టీలో ఒక కుదుపు వచ్చేలా చేసారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎదో జరిగిపోతుంది అని, పెద్ద సంక్షోభం వచ్చేస్తుంది అంటూ ప్రత్యర్ధులు హడావిడి మొదలు పెట్టారు. ఓటమితో డీలా పడిన కార్యకర్తలు కూడా, ఈ వార్తలతో కొంత ఆందోళన చెందారు. ఈ పరిణామాల అన్నిటి పై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్విట్టర్ లో స్పందించారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, తన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు పెడుతూ, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఇలాంటి సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని చంద్రబాబు అన్నారు. ప్రతి సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో ధీటుగా ఎదిగింది అని గుర్తు చేసారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారని, ఇదే పార్టీకి బలమే అని చంద్రబాబు అన్నారు.
బీజేపీ చేస్తున్న అవకాశవాద రాజకీయాల్లో ఇలాంటి నాయకులు పావులుగా మారి పార్టీని వీడినా, కార్యకర్తలు, ప్రజల అండదండలు ఎప్పుడూ మనతోనే ఉంటాయని అన్నారు. నాడు బీజేపీకి దూరమయ్యింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని, రాజకీయంగా నష్ట పోతాం అని తెలిసినా, రాష్ట్రం కోసం మోడీతో పోరాడమని అన్నారు. మోడీని ఎవరూ ఎదుర్కొని టైంలో, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడామని, అదే బీజేపీతో కాంప్రోమైజ్ అయ్యి ఉంటే, రాజకీయంగా పార్టీ పరిస్థితి నేడు చాలా మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. కాని పార్టీ బాగు కన్నా, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు కోసం, పార్టీని పణంగా పెట్టి పోరాటం చేశామన్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారికి, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, తనకు ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, గతంలోనూ తెలుగుదేశం చచ్చిపోయిందని, పూడ్చి పెట్టామని కొందరు ప్రగల్భాలు పలికారని, ప్రజలు, కార్యకర్తల బలంతో ఆ స్థితి నుంచి కూడా పోరాడి మళ్ళీ అధికారాన్ని పొందామని గుర్తు చేశారు.