భారత రక్షణ విభాగంలో ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న ఏవీ ధర్మారెడ్డి తన పదవిని దుర్వినియోగం చేసి, వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి ఆరోపించారు. ఐఎఎస్ అధికారిగా తగిన అర్హతలు లేకున్నా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ధర్మారెడ్డి నియమితులయ్యారన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మారెడ్డి టిటిడి నుండి బదిలీ అయిన తర్వాత వివిధ పదవుల్లో పనిచేసి, ప్రస్తుతం దేశ రాజధానిలో రక్షణ వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈయన తన పదవిని ఉపయోగించుకుని భారత ఎన్నికల సంఘం అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలకు సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత పదవిలో కొనసాగుతూ, తన సామాజికవర్గం కోసం పనిచేస్తూ 11 కేసుల్లో నిందితుడైన జగన్మోహనరెడ్డికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ ఓటర్లలో అయోమయాన్ని రేపుతూ సామాజికవర్గాల మధ్య వైషమ్యాలను ప్రోత్సహించే విధంగా ఆయన ధోరణి ఉందన్నారు. ఓటర్ల జాబితాపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ధర్మారెడ్డిపై భారత ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నడూలేని విధంగా ఓట్ల తొలగింపు ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీ వారి ఓట్లు తొలగిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కొందరు సైబర్ నేరగాళ్లు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు సిద్దమయ్యారని, జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం గమనార్హం. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఓటరు జాబితాలో వారి పేరు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రయత్నాలు బహిరంగం కాకూడదని వైసీపీ నేత లు ముందే జాగ్రత్తపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓట్లను తొలగిస్తోందని ఆరోపనలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో సాగుతుంది. మరోవైపు ఓ బీహారి సూచనలతోనే రాష్ట్రంలో టీడీ పీ ఓటర్ల ఓట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభించారని టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ కూడా ట్విట్టర్‌లో ఆరోపించారు.