జమ్మలమడుగు శాసనసభ్యుడుగా వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని గెలిపించే బాధ్యత తనదేనంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. జమ్మలమడుగు నగర పంచాయతీకి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆయన బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నేను గెలుస్తానో లేదో రామసుబ్బారెడ్డిని మాత్రం జమ్మలమడుగులో గెలిపిస్తానన్నారు. జమ్మలమడుగులో వైసీపీకి కొత్తగా వచ్చిన బిక్షగాడు ముందు తనపై విమర్శలు చేసి, ప్రస్తుతం మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిపై విమర్శలు చేస్తున్నాడన్నారు. జగన్ పత్రికలో డొక్కు వార్తలు రాసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు.
జగన్మోహన్రెడ్డి వాళ్లనాన్న రాజశేఖర్‌రెడ్డి మహానేత అంటుంటారని, మరి రాష్ట్రాన్ని పదింతలు అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఏనేత అని పిలువాలో జగన్ ఆలోచించుకుని చెప్పాలన్నారు. తాను ఇటీవల పులివెందులకు ప్రచారానికి వెళ్లానన్నారు. ఎక్కడ చూసినా రైతులకు నీళ్లు రాకూడదని, వర్షం రాకుండా ఉండాలని, ప్రమాదాలు జరగాలని, వీధిలైట్లు వెలగరాదని, డ్వాక్రా వారికి చెక్కులు చెల్లకుండా ఉండాలనే ఆలోచన జగన్‌కు ఉందన్నారు. మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలు టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన మాట ప్రకారం తామిద్దరం కలిశామని, ఆ తర్వాతనే జమ్మలమడుగు ప్రాంత అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికోసం తాము ఎంతో కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చైౖర్‌పర్సన్ తులసి, టీడీపీ నాయకులు జంబాపురం రమణారెడ్డి, వేమనారాయణరెడ్డి, పొన్నపురెడ్డి శివారెడ్డి, వైస్‌చైౖర్మన్ ముల్లాజానీ, కమిషనర్ లక్ష్మిరాజ్యం, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, తాతిరెడ్డి రోహిత్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మిదేవి, రజియా, గడ్డవీధి రషీద్, సయ్యద్, ఉస్మాన్, దేవగుడి యూత్, ఆర్.రామకృష్ణారెడ్డి, కోలా కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.