ఇదేమన్నా సాంప్రదాయమో, లేక సెంటిమెంటో కాని, వైసీపీలో ఎవరు చేరినా, రెండో రోజే వారికి జర్క్ ఇవ్వటం, వైసీపీ పార్టీ స్టైల్. ఇది వరకు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు తాజగా దగ్గుబాటి వంతు. అలా జగన్ కు కలిసారో లేదో, రెండో రోజే, వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చుపెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. అంతేకాదు దగ్గుబాటి కుంటుంబానికి వ్యతిరేకంగా పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దగ్గుబాటి చేరికకు వ్యతిరేకంగా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. తొలుత తన కుమారుడు హితేష్‌ను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం గతంలో తాను రాసిన మూడు పుస్తకాలను దగ్గుబాటి జగన్‌కి అందజేశారు.
పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి హితేష్‌ను రంగంలోకి దించుతానని ఆయన మరోసారి చెప్పగా అందుకు జగన్ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. అయితే దగ్గుబాటి రాకను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు రోటరీ భవన్లో వైకాపా నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని.. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి దగ్గుబాటి ఎంట్రీతో వైసీపీని నమ్ముకుని, ఇన్నాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు చుక్కలు చూపించాడు జగన్.