సొంత పెదనాన్న కొడుకు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. తన తండ్రిని చంపిన హంతకులకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆయనకి కేంద్రం అండదండలున్నాయి. వ్యవస్థలని మేనేజ్ చేయడానికి స్వామీజీలు, లాబీయిస్టులు లెక్కలేనంత మంది ఉన్నారు. అటువంటి `పవర్` ఫుల్ వ్యక్తిని ఢీకొడుతోంది డాక్టర్ సునీతారెడ్డి. తన తండ్రిని చంపిన హంతకులని చట్ట ప్రకారం శిక్ష పడాలనే లక్ష్యంతో ఎవరి అండదండా లేకుండా ఒంటరిపోరాటం చేస్తోంది. అధికారం, డబ్బు, వ్యవస్థలని మేనేజ్ చేసే యంత్రాంగం ఉన్న పెద్దలు ..వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆడుతున్న డ్రామాలని పసిగట్టేసిన సునీతారెడ్డి...పట్టువదలకుండా పోరాడుతోంది. పాత్రధారులు పట్టుబడ్డారు. సూత్రధారులు అధికారం వెనుక దాక్కున్నారు. వారినీ చట్టం ముందు నిలబెట్టేందుకు సునీతారెడ్డి ఉద్యమంలా ఫైట్ చేస్తున్నారు. వైసీపీ క్యాంపులో కీలకనేతలకి ఈ హత్యతో సంబంధం ఉండడం, సునీత వైపు న్యాయం ఉండడంతో ఆమె పోరాటాన్ని కుయుక్తులతో ఎదుర్కోవాలని చూస్తున్నారు. చివరికి కుటుంబసభ్యులనీ ఒక్కొక్కరినీ రంగంలోకి దింపుతున్నారు. వివేకానందరెడ్డి గొడ్డలిపోటు అని ఒకసారి, గుండెపోటు అని మరోసారి, ముస్లిం మతంలోకి మారాడని మరోసారి, రెండోపెళ్లి గొడవలంటూ ఇంకోసారి, వివాహేతర సంభంధాలను అంటగట్టి హత్యకేసు నుంచి తప్పించుకోజూశారు. సునీతారెడ్డి ఏ దశలోనూ సహనం కోల్పోవడంలేదు. న్యాయపోరాటాన్ని వీడలేదు. వివేకా రెండో భార్య బేగంని తన ఇంటికి పిలిపించుకున్నాడు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. తన సొంత తల్లి, చెల్లిని తరిమేసినోడు...బాబాయ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడూ అయిన అబ్బాయ్..ఈ సవతి పిన్నిని ఎందుకు చేరదీస్తాడో తెలియనంత అమాయకులు ఏపీలో లేరు. ఆమెని సునీతారెడ్డిపైకి ఉసిగొల్పి తాము బయటపడాలనే వ్యూహం అమలు చేశారు. అది ఫెయిలైంది. ఇప్పుడు మరో పాత్రని దింపారు. సునీతారెడ్డి మేనత్త, వైఎస్ వివేకానందరెడ్డి చెల్లెలు విమలారెడ్డిని దింపారు. ఆమె తన అన్న మంచోడు అనీ, ఆయన చంపిన వాళ్లు మంచోళ్లు అని సర్టిఫికెట్ ఇస్తోంది. తన అన్న కూతురే గబ్బు పట్టిస్తోందని చెబుతోందంటే..దీని వెనక ఎవరున్నారో ఇట్టే అర్థమైపోతుంది.
news
కేంద్రం ఏపీకిచ్చిన 10 వేల కోట్లు...వెనక జగన్ సంతకం?
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రానికి సడెన్‌గా ప్రేమ పొంగింది. 2014-15లో ఇవ్వాల్సిన లోటు నిధులు 8 ఏళ్ల తరువాత అడగకుండానే విడుదల చేయడం వెనుక ఏదో చిదంబర రహస్యం ఉందని అంతా అనుమానించారు. కర్ణాటక ఎన్నికల ఖర్చు వైసీపీ భరించినందుకే ఈ పదివేల కోట్లు ఇచ్చారని కొందరు అంటుంటే, ముందస్తుకి వెళ్లే జగన్ రెడ్డికి సహాయంగా ఉంటుందని, తమకీ తెలంగాణలో ఎన్నికల ఖర్చు సర్దుబాటు చేస్తాడనే ఒప్పందం వల్లే ఈ పదివేల కోట్లు 8 ఏళ్ల తరువాత విడుదలయ్యాయనే విశ్లేషణలున్నాయి.
అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ టిడిపి నేతలు, ఆర్థికవేత్తలు పదివేలకోట్లు వెనుక రాష్ట్రానికి పెడుతున్న తూట్లు ఏ స్థాయిలో ఉన్నాయో గుట్టురట్టు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏ ఒప్పందంపై సంతకం పెట్టమంటే అక్కడే పెట్టేస్తూ ఎడాపెడా అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇంకా అప్పులు దొరికే అవకాశం లేదు, గరిష్టంగా కేంద్రం కూడా ఇవ్వాల్సినంత ఇచ్చి, పుచ్చుకోవాల్సినవి పుచ్చుకుందనే ప్రచారం ఉంది. 2014-15లో కొత్తగా ఏర్పడిన ఏపీకి చట్టప్రకారం ఇవ్వాల్సిన లోటు నిధులు రూ. పది వేల కోట్లు ఇవ్వకుండా ..యుటిలిటీ సర్టిఫికెట్లు, పీడీ అక్కౌంట్లు అని కాలయాపన చేసిన కేంద్రం ప్రభుత్వం..ఇన్నేళ్ల తరువాత అవే నిధులు విడుదల చేసింది. దీని వెనుక కారణాలను ఆర్థిక వేత్తలు లోతుగా విశ్లేషించగా, విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇకపై ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేంద్ర ప్రాజెక్టులు, పథకాలకు నిధులు అడగబోమనే కండిషన్లపై సంతకాలు చేసి ఇచ్చి కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తెచ్చుకుంది ఏపీ సర్కారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులనీ వదులుకుని, ఇలా సంతకం పెట్టడం ఏపీకి ఆర్థికంగా ఉరివేయటమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు వదులుకున్నట్టే. ఏపీలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకాలకూ ఇకపై నిధులు ఇవ్వరు, ఇవ్వాలనే అడిగే హక్కునీ వదులుకుంటున్నామని జగన్ రెడ్డి సంతకం చేసిన తరువాతే పదివేలకోట్లు వచ్చాయి. అంటే ఇది లోటు భర్తీ కాదు, రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద పోటు.
సీఐడీ అర్ధరాత్రి అరెస్టులు..సీబీఐకి చేతకాదా?
ఏపీలో తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా అరెస్టులకి బరితెగించే సీఐడీ, కళ్ల ఎదుటే హత్యకేసు నిందితుడున్నా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేయలేని నిస్సహాయ స్థితికి ఎవరు కారణం అనఏ చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి ఇంటి గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేసిన సీఐడీ దారుణాలు వందల్లో ఉన్నాయి. సీఐడీ పెట్టిన కేసుల్లో చాలా కోర్టుల్లోనూ నిలబడలేదు. అటువంటి అక్రమకేసుల్లో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిన సీఐడీ కోర్టులో దోషిగా నిలబడినా తీరు మారలేదు. సొంత బాబాయ్‌ని చంపేసిన వైఎస్ వివేకానందరెడ్డిని అరెస్టు చేయడానికి మాత్రం సీబీఐ వీల్లేదంటోంది జగన్ రెడ్డి సైన్యం. సీబీఐ కూడా నిందితుడు అవినాష్ రెడ్డి చెప్పినట్టల్లా ఆడుతోందనే ఆరోపణలున్నాయి. సీబీఐయే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా వెసులుబాట్లు కల్పిస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. తప్పు చేయని తమపై సీఐడీని ఉసిగొల్పి తప్పుడు కేసులు బనాయించి, ఇంట్లో పిల్లల్ని సైతం బెదిరించి అరెస్టులకి తెగబడిన తీరుపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రశ్నించారు. మాకో న్యాయం, అవినాష్ రెడ్డికి ఓ న్యాయమా అంటూ నిలదీశారు.
కేశినేని నాని వ్యాఖ్యలతో, మరోసారి అయోమయంలో బెజవాడ టిడిపి శ్రేణులు...
టిడిపికి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అధిష్టానంతో అంటీముట్టనట్టు చేస్తున్న వ్యవహారాలు బ్లూ మీడియాకి హాట్ టాపిక్ అయ్యాయి. ఇక కేశినేని నాని వైసీపీ నేతలని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ హఠాత్పరిణామానికి కారణాలేంటని విశ్లేషిస్తే, 2019లో టిడిపి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఎంపీగా గెలిచానని, పార్లమెంటు పరిధిలోనూ టిడిపి అసెంబ్లీ అభ్యర్థులంతా ఓడిపోయినా విజయం సాధించడం తన చరిష్మా అని కేశినేని నాని గట్టిగా నమ్ముతున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే గెలుస్తాననే ప్రగాఢ విశ్వాసంలో ఉన్నారు నాని. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ళ పందితో అయినా కలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అక్కడితో ఆగకుండా తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తాననడం ఏదో పెద్ద వ్యూహమేనంటున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుని ప్రశంసిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం, తన ఎంపీ నిధులని వాడుకుని నందిగామ, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ ప్రశంసల వెనుక రాజకీయం ఏంటో మరి. మరోవైపు నాని తమ్ముడు చిన్ని పార్లమెంటు టిడిపి టికెట్ ఆశిస్తూ దూసుకుపోతున్నారు. ఓవైపు టిడిపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు అందరినీ తన వైపు తిప్పుకున్నారు. అధిష్టానంతో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటు పరిధిలో కేశినేని ఫౌండేషన్ కార్యక్రమాలు విస్తృతం చేశారు. అయితే కేశినేని నాని చేస్తున్న ప్రకటనలతో మాత్రం, బెజవాడ టిడిపి శ్రేణులు అయోమయంలో పడుతున్నారు.