మొదటి మూడేళ్ళు ఒక వెలుగు వెలిగిన బీజేపీకి, సంవత్సర కారణంగా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అమిత్ షా, మోడీలకు ఎదురు లేకుండా పోయింది అనుకున్న టైంలో అటు రాజకీయంగా, ఇటు ప్రజల్లోనూ డౌన్ ఫాల్ మొదలైంది. రోజు రోజుకీ దిగాజారిపోతున్న బీజేపీ, దీనికి కారణాలు వెతకటం ప్రారంభించింది. ఈ కారణాలు ప్రజల వైపు నుంచి ఆలోచించకుండా, జాతకం, వాస్తు వైపు నుంచి అలోచించి, సమస్య ఎందుకు వచ్చిందో కనుక్కుంది. ఇంతకీ సమస్య ఏంటో తెలిస్తే, మీరు అవాక్కవుతారు. కారణం ఏంటి అంటే, కొత్త బీజేపీ ఆఫీస్ వాస్తుగా బీజేపీ పెద్దలు తేల్చారు.
దేశ రాజధాని ఢిల్లీ.. దీనదయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్-6.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం.. అధునాతన హంగులు, సకల సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన ఐదు అంతస్తుల విలాసవంతమైన భవనం.. ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తిచేసి సాక్షాత్తూ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభించారు. కానీ అది బీజేపీకి అస్సలు అచ్చిరాలేదని పార్టీ నేతలు బాధపడుతున్నారు. ఆ భవనంలోకి మారాక.. యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్, కైరానా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మూటకట్టుకుంది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక చతికిలబడింది.
నమ్మకమైన మిత్రపక్షం టీడీపీని కోల్పోయింది. జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవలసి వచ్చింది.. మిత్రపక్షం శివసేన తెగదెంపులకు సిద్ధమైంది.. కొత్త కార్యాలయంలో అడుగుపెట్టాకే ఈ ఎదురుదెబ్బలన్నీ తగిలాయని పేరుచెప్పడానికి ఇష్టపడని ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ‘వార్‌రూం’ను కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేయొద్దని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి వస్తోంది. అగ్రనాయకత్వం కూడా ఇదే అభిప్రాయం ఉండడంతో మళ్లీ అశోకా రోడ్-11లోని పాత కార్యాలయానికి మకాం మార్చాలని భావిస్తోంది. 2014లో మోదీ సారథ్యంలో బీజేపీ బరిలోకి దిగినప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్‌కు చెందిన లోధీ ఎస్టేట్ బంగళాను వార్రూంగా ఉపయోగించారు. ఇది బీజేపీకి బాగా కలసివచ్చి.. సొంతగానే మెజారిటీ సాధించింది.