మోడీ క్లీన్ ఇమేజ్ అంటూ కబురులు చెప్తూ, 5 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్తున్న బీజేపీకి, ఊహించని షాక్ తగిలింది. కొత్తగా వచ్చిన సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్, రాఫెల్ కేసు పై విచారణ చెయ్యనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆరోపణలకు మాత్రమే ఉన్న ఈ అంశం, ఇక కోర్ట్ లో విచారణకు రానుంది. దీనిలో ఉన్న నిజా నిజాలు అన్నీ బయటకు వస్తే, ఇక మోడీ క్లీన్ ఇమేజ్ అనేది ఉత్తి మాటే అవుతుంది. కేంద్రంలో ప్రతిపక్షాలు ప్రధాని మోడీని నలభై వేల కుంభకోణమంటూ విమర్శల పాలు చేస్తున్న రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశం మీద దాఖలైన రెండు వాజ్యాలపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. వినీత్ అనే న్యాయవాది దాఖలు చేసిన రాఫెల్ ఒప్పందంపై ప్రజాప్రయోజన వాజ్యం.. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ రెండు రేపు విచారణకు రానున్నాయి.
ఈ రెండు పిటిషన్లను కలిపి రేపు విచారించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ సంస్థ ఎరోనాటిక్ ను పక్కనబెట్టి అనుభవంలేని రిలయన్స్ డిఫన్స్ ను ఫ్రాన్స్ సంస్థతో భాగస్వామిని చేసిన మోడీ సర్కార్ నిజానిజాలు తేల్చాలని.. భారత్-ప్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం.. గతంలో యూపీఏలో చేసుకున్న ఒప్పందం.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. వ్యత్యాసాలు..ఫ్రాన్స్ కంపెనీకి రిలయన్స్ సంస్థ ఎలా భాగస్వామిగా చేరిందనే అంశం మీద విచారణ జరగనుంది.
మరో పక్క కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కూడా మోడీని ఈ విషయంలో విమర్శించారు. రాఫెల్ ఒప్పందాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) నుంచి లాక్కుని అనిల్ అంబానీకి ఇచ్చారంటూ తప్పుపట్టారు. రాజస్థాన్లోని ధోల్పూర్లో మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, రూ.45,000 కోట్ల మేరకు బకాయిలు ఉన్న అనిల్ అంబానీకి 'హాల్' నుంచి గుంజుకున్న రాఫెల్ ఒప్పందాన్ని మోదీ కట్టబెట్టారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పుడు మోదీ తన కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయారని అన్నారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధరను రూ.526 కోట్ల నుంచి రూ.1,600 కోట్లకు ప్రధాని పెంచేశారని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం ఖరారుకు ప్రధాని స్వయంగా అంబానీని తన వెంట పెట్టుకుని వెళ్లారని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానం కూడా తయారు చేయని అనిల్ అంబానీకి ఈ డీల్ ఎలా ఇచ్చారని ఎద్దేవా చేశారు.