15వ ఆర్థికసంఘ విధివిధానాలను సవరించాలన్న డిమాండ్‌తో అక్టోబర్ చివరి వారంలో ఢిల్లీలో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఇందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, ఆర్థికరంగ నిపుణులు, రాజకీయపార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకొచ్చిన యనమల అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం నాటి సమావేశంలో కేరళలో ఇటీవలి జలప్రళయ నష్టాన్ని సరిదిద్దేందుకు అక్కడి ప్రభుత్వం ఎస్‌జీఎస్‌టీపై సెస్ వేసుకోవడానికి జీఎస్టీ కౌన్సిల్ అనుమతి కోరగా.. తాము మద్దతు పలికినట్లు తెలిపారు.
అయితే జాతీయ స్థాయి సమస్యలను కేంద్ర ప్రభుత్వం సెస్‌తో ముడిపెట్టాలని చూస్తోందని, దానికి తాము వ్యతిరేకమని యనమల వెల్లడించారు. ఇటీవల చక్కెరపై సెస్ వేయడానికి కేంద్రం ప్రయత్నించగా తాము అంగీకరించలేదని పేర్కొన్నారు. పంటలు దెబ్బతినడం, ధరలు పడిపోవడం వంటి ఘటనలను ప్రకృతి వైపరీత్యాలతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. నష్టపోయిన రాష్ట్రాల్లో సెస్ వేసుకుంటే బాగుంటుందని, దానిని అన్ని రాష్ట్రాలపై రుద్దడాన్ని తాము అంగీకరించడం లేదన్నారు. భవిష్యత్తులో అదే సంప్రదాయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను మార్చాలన్న డిమాండ్‌పై తొలి నుంచి పోరాడుతున్న కేరళ ఆర్థికమంత్రి, దిల్లీ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి ఆర్థికమంత్రులు ప్రత్యేకంగా సమావేశమై అక్టోబర్ చివరి వారంలో దిల్లీలో రెండురోజులపాటు సెమినార్ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా జీఎస్టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగినందున కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించబోదని యనమల రామకృష్ణుడు తెలిపారు. శుక్రవారంనాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ఆదాయాల గురించి విశ్లేషించి, ఆంధ్రప్రదేశ్ కనబరుస్తున్న పనితీరును అభినందించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. రక్షిత ఆదాయం కంటే ఒక్క శాతం అధికంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం రాదన్నారు.