నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకం. తాజాగా ఆ స్థాయికి తగ్గట్టు ప్రత్యేక ఆకర్షణగా ఇస్తాంబుల్ తరహాలో ఆధునిక టవర్ బిల్డింగ్ నిర్మించనున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వేకు తోడు నూతనంగా నిర్మిస్తున్న రన్‌వేకు మధ్య భాగంలో.. వీకేఆర్ కాలేజీ వైపుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో రన్‌వే మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టవర్ బిల్డింగ్‌లో ఆర్కిటెక్చర్ నైపుణ్యం అణువణువూ కనిపిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా... అలాంటి టవర్ ఏర్పాటుకు రూ.25 కోట్ల అంచనాతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టవర్ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆరు అంతస్థులుండే ఈ టవర్ బిల్డింగ్ పొడవు 30 మీటర్లు.. అంటే 100 అడుగుల పొడవుంటుంది. బిల్డింగ్ పై భాగంలో టవర్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో పాత టెర్మినల్ దగ్గర ఏటీసీ టవర్ బిల్డింగ్ ఉంది. ఈ ఏటీసీ టవర్ బిల్డింగ్ పశ్చిమ దిశన రన్‌వే మొదట్లో ఉం టుంది. ఎయిర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే.. రన్‌వే మధ్య భాగంలో ఏటీసీ టవర్ బిల్డింగ్ ఏర్పాటు శ్రేయస్కరం. రన్‌వే రెండు వైపులా కనిపించటానికి వీలుగా ఒక పక్కన దీన్ని నిర్మించాలి. దీనిపై నుంచి చేస్తూ విమా నం ల్యాండింగ్, టేకాఫ్ వంటివి కూడా స్పష్టం గా కనిపిస్తాయి. కొత్త టవర్ బిల్డింగ్ డిజైన్లకు అప్పుడే శ్రీకారం చుట్టారు.
వీటిలో ఒక దానిని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, ఎయిర్‌పోర్టుకు ఇటీవలే ఆస్ర్టియా దేశం నుంచి అత్యంత శక్తివంతమైన రెండు ఫైర్ ఫైటర్లను ఒక్కొక్కటీ రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. టేకాఫ్, ల్యాండింగ్‌లో రన్‌వేపై ప్రమాదం జరిగితే రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుంటాయి.