తాను దూర సందు లేదు, మెడకో డోలు అన్నాడు అంట వెనుకటి ఒకడు.. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితే అర్ధం కాకుండా ఉంటె, శ్రీకాకుళం బీజేపీ నేతలు మాత్రం, పవన్ వల్ల మేము గట్తెక్కుతాం, వచ్చే ఎన్నికల్లో సీట్లు కొట్టేస్తాం అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో క్యాడర్ లేకపోవడం ఒకెత్తయితే ఉన్న వారు కూడా జనంలోకి వెళితే తమకు ఆదరణ ఉండదనే భయంతో అక్కడక్కడ కార్యక్రమాలకే పరిమితమవు తున్నారు. మరో పక్క ఎన్నికలు సమీపి స్తుండడంతో సొంతం గా పోటీ చేయాలా? పొత్తులు ఉంటాయా? అనే స్పష్టత లేక అడుగులు ఎటు వేయాలో తెలియని అయోమయం నెలకొంది.
టీడీపీ, వైసీపీ, జనసేన అస్త్ర శస్త్రాలతో ముందుకు పోతుండగా మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పుడు తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామనే నినాదంతో మళ్లీ జనంలోకి వెళ్లడం మొదలుపెట్టింది. కానీ బీజేపీ మాత్రం ఏం చేయాలో తెలియక ఎన్నికల వ్యుహం లేక చతికిల పడింది. అయితే ఎన్నికల్లో పోటీచేయాలన్న అంశం లో ఒకసారి సొంతంగా పోటీకి దిగుతామని అగ్రనేతలు చెబుతున్నారు. కానీ జనసేనతో పొత్తు ఉండవచ్చనే అంతర్గత సమాచారం పార్టీ నేతల వరకు పాకింది. దీంతో జిల్లా నేతలు సైతం సొంతంగా పోటీ చేస్తే ఒరిగేదేమీ ఉండదని, అందుకే జనసేనతో పొత్తు ఉంటే కొంత వరకైనా ప్రజయోజనం ఉంటుందని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వల్ల మనం గట్టెక్కుతామని, కొన్ని సీట్లు కూడా వస్తాయని అంటున్నారు. ఈ దిశగా అధిష్టానం మరింత చురుకుగా వ్యవహరించి, పవన్ తో పొత్తు పెట్టుకునేలా చేస్తే, ఇక వార్ వన్ సైడ్ అయిపోతుంది అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడివేణుగోపాలం లేదా దుప్పల రవీంద్రబాబు పోటీ చేయాలని భావిస్తున్నారు. పలాస నుంచి మాజీ ఎంపీ కణితి విశ్వనాథం లేదా ఆయన తనయుడు లేదా తనయురాలికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నారు. పవన్ తో పొత్తు ఉంటే, ఈ సీట్లు అడుగుదామని, జిల్లా నేతలు అంటున్నారు.