విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కొద్దిసేపటికే తమ సహాయ సహకారాలు అందించడానిక పెద్దఎత్తున దాతలు ముందుకొచ్చారు. స్థానికులు, ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్ర అన్న క్యాంటీన్లు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పేదల పట్ల ఉన్న ప్రేమ, అభిమానాలు గమనించిన కొందరు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ముఖ్యమంత్రికి అందజేశారు. దాతలను ముఖ్యమంత్రి అభినందించారు.
• మండవ కుటుంబరావు 1 లక్ష రూపాయలు విరాళం అందజేశారు. దీనికి తోడుగా నెలకు 10 టన్నుల కూరగాయలు అందిస్తామన్నారు. • కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనురాధ తన మనవడు పుట్టినరోజు జూలై 14 పురస్కరించుకుని 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. • విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ 25,000 రూపాయలు ప్రకటించారు. • విజయవాడ శాసన సభ్యులు జలీల్ ఖాన్ 25,000 రూపాయల చెక్ ను ముఖ్యమంత్రికి అందజేశారు. • కృష్ణా జిల్లా ఏఐఈ పి.బాబూరావు 10,000 విరాళం అందజేశారు. • ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ జి. కోటేశ్వరరావు 25,000 రూపాయలు విరాళం అందజేశారు. • కార్పొరేటర్లు గాంధీ రూ.10,000/- నాగమణి రూ.2000/- విరాళంగా అందజేశారు.
మొదటి విడతలో 35 పట్టణ ప్రాంతాలలో 100 క్యాంటీన్లు ప్రారంభోత్సవంలో భాగంగా విజయవాడ భవానీపురం 28వ డివిజన్ లో నిర్మించిన అన్న క్యాంటీనును ముఖ్యమంత్రి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విజయవాడ ఏ-కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. నిరుపేదల ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం-భోజనం అందిస్తున్నామన్నారు. సమాజంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని.. తాము రూపాయకే కిలో బియ్యం అందిస్తున్నామన్నారు. రోజుకు 2,15,000 ప్లేట్ల అల్పాహారం, భోజనాలను వడ్డించడం జరుగుతుందన్నారు.