గన్నవరం నుంచి నుంచి సింగపూరుకి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు కొన్ని రోజుల క్రిందట ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ మార్గంలో ప్రస్తుతం ఉన్న చార్జీల క్రమంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, ఇదేదో ఫోర్మలిటీగా చేసారు. ప్రజల నుంచి ఎదో రెస్పాన్స్ వస్తుందిలే అనుకున్నారు కాని, ప్రజాలు మాత్రం అనూహ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు.
విజయవాడ (గన్నవరం)- సింగపూర్ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్, ఈమెయిల్ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. దీంతో, విజయవాడ-సింగపూర్ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ముఖ్య కార్యనిర్వహణాధికారి గురువారం దిల్లీ వెళ్లారు.
విజయవాడ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బయలుదేరాలంటే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనేకమంది ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో నెలాఖరులోగా సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే కేంద్రం నుంచి అనుమతుల జారీలో జాప్యమయ్యే అవకాశం ఉండడంతో వచ్చే నెలలో విమానయాన సేవలు ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సిల్క్ ఎయిర్, ఇండిగో, స్పైస్ జెట్ తదితర సంస్థలు విజయవాడ- సింగపూర్ మధ్య విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ- నాగార్జునసాగర్, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.