సునామీ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్కాయిస్) సమాచారం మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే పడే అవకాశం ఉండగా రెవెన్యూ, పోలీసు, సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఒకవేళ వెళ్లినా వారికి సమాచారం ఇచ్చి తిరిగి రప్పించాలని మత్స్య శాఖాధికారులకు సూచించారు.
కలెక్టరేట్లో 08672-252847 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సముద్ర ప్రాంతాలైన ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిజాస్టర్మేనేజ్మెంట్ కమిటీలు, రెడ్‌క్రాస్ వంటి సహాయ సంస్థలు అప్రమత్తం కావాలని కలెక్టర్ కోరారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) హెచ్చరించింది. రానున్న రెండు రోజుల మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది.
అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు.