ఆధునిక సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా, సంస్కరణవాదిగా చంద్రబాబును అభివర్ణించింది హిందుస్థాన్ టైమ్స్.... సింగపూర్ లో జరుగుతున్న, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును పరిచయం చేస్తూ హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రాజధాని అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అన్నింటికంటే సెద్ద సంక్షోభమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని, అయితే... కొత్త రాజధానికి భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్ అన్నారు... రాజధాని అంశం పై చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇది...
“నేను రెండు దశాబ్దాలకు పైగా సింగపూర్‌ను పరిశీలిస్తున్నాను. వారు చాలా వేగంగా ముందడుగు వేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం. నాలుగేళ్ల పసికూన. అత్యంత జాగరూకతతో సాకవలసిన బిడ్డ. రాజధాని కూడా లేకపోవడం ఈ రాష్ట్రానికి అన్నింటికంటే పెద్ద సంక్షోభం. సైబరాబాద్ వంటి ఆధునిక నగరాన్ని నిర్మించిన అనుభవం ఉంది. బ్రౌన్‌ఫీల్డు సిటీగా ఇప్పటికే హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. అదే అనుభవం నాకు ఇక్కడ అక్కరకొచ్చింది. తొలుత కొత్త రాజధాని కోసం ఒక చక్కటి ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. కొత్త రాజధానికి చాలినంత భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్. అంత భూమి కూడా ప్రభుత్వపరంగా ఎక్కడా లభ్యంగా లేదు. అంత భూమిని ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై మథనం చేశాను. మా దగ్గర అంత భూమిని సమకూర్చుకునేందుకు అవసరమైన డబ్బు కూడా లేదు."
"అన్నీ ఆలోచించి ఒక్క పిలుపునిచ్చాను. నా పిలుపు విని ఇప్పటి రాజధాని రైతులు తక్షణం స్పందించారు. వారు నన్ను విశ్వసించారు. వారికి నేను ఒకటే చెప్పాను. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పాను. వారు నమ్మి ప్రభుత్వానికి 33 వేల ఎకరాల విలువైన భూముల్ని ధారదత్తం చేశారు. వెంటనే నేను కార్యాచరణలోకి దిగాను. రాజధాని నిర్మాణం కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించాలని తొలుత సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించాను. వారు వెంటనే తమ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వారు స్పందించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. చెప్పినట్టే వారు 6 మాసాల అత్యంత తక్కువ కాలంలో మా రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారు. ఆ తరువాత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టాం. విశాలమైన రహదారులు, భూగర్భజల వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటీ పూర్తిచేస్తూ వస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకుని మా రాజధాని ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకుంటున్నాం,” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.