ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చేస్తాం అంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఆ దిశగా ప్రజలతో మమేకం అవ్వల్సింది పోయే, దాడులు చేస్తున్నారు... ఎదుటి వారికి నీతులు చెప్పే వీరు మాత్రం, అసాంఘిక శక్తుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు... ఆయన పేరు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి... పోయిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మల్యేగా పోటీ చేసి ఓడిపోయారు... ఐదు కార్లలో వచ్చిన ఆయన అనుచరులు, వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా గేట్లు విరగ్గొట్టి, కౌంటర్ అద్దాలు పగులగొట్టి, అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యం చేసి, టోల్గేట్ వద్ద బీభత్సం సృష్టించారు. సార్ మీరు తప్పు చేసారు, నష్ట పరిహారం చెల్లించి వెళ్ళండి అని అక్కడ నిర్వాహకులు అంటే, ‘నువ్వేమి చేసుకుంటావో చేసుకో...నష్ట పరిహారం ఇచ్చేది లేదు’ అంటూ సురేష్‌రెడ్డి నిర్వాహకులతో దురుసుగా వ్యవహరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురే్‌షరెడ్డి ఆయన అనుచరులు శనివారం ఉదయం ఐదు కార్లలో బయలుదేరారు. వెంకటాచలం వద్ద ఉన్న స్వర్ణ టోల్‌ప్లాజా ఫ్రీ గేట్లు వద్ద కార్లు ఆగాయి. గేట్లు ఎత్తాలని సిబ్బందిని కోరారు. ఫ్రీ పాస్ ఉంటే తప్ప గేట్లు ఎత్తలేమని సెక్యూరిటీ సిబ్బంది బదులిచ్చారు. ‘రే...సురేష్‌రెడ్డి వస్తే గేట్లు తీయవా’అని ఆగ్రహించిన అనుచరులు గేట్లు, కౌంటర్ అద్దాలను ధ్వంసం చేశారు.
శనివారం సాయంత్రం తిరిగి వస్తుండగా టోల్‌ప్లాజా నిర్వాహకులు జరిగిందేదో జరిగిపోయింది..సర్దుబాటు చేసుకుం దాం...నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. దీనికి సురేష్‌రెడ్డి అంగీకరించకుండా మరోసారి దురుసుగా ప్రవర్తించారని టోల్‌ప్లాజా సెక్యూరిటీ మేనేజర్ పట్రా శివరాం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, గార్డు గురవయ్య, గన్‌మెన్ మురళీశర్మలపై దాడి, దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు క్రైమ్ నెంబరు 321/17తో సురేష్‌రెడ్డి మరో ఏడుగురిపై 427, 352, 506, 290 ఐపీసీ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.