ప్రభుత్వాలు నడిపే ఆర్టీసీ బస్సులు పై ప్రజల్లో ఒకోసారి విసుగు వస్తూ ఉంటుంది. బస్సులు సమయానికి రావు, పనులు లేట్ అయిపోతాయి, స్కూల్స్‌కి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మనం వెళ్ళాల్సిన రూట్ లో బస్సులు కూడా క్యాన్సిల్ చేసేస్తారు. అయితే ఈ సమస్యలు పరిష్కారం కావాలి అంటే, ఆర్టీసి అధికారులకు మోర పెట్టుకుంటాం. సమస్య పరిష్కారం చాలా సార్లు అవ్వదు కూడా. అయితే ఇక్కడ మాత్రం, ఆర్టీసిలో బస్సుల సమస్య పై ఏకంగా ఈ దేశ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం, ఆయన స్పందించటం, సమస్య పరిష్కారం అవ్వటం కూడా జరిగిపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్ధి, తాను ఎదుర్కుంటున్న సమస్య పై చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణకు లేఖ రాసారు. తమది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా,మేడ్చల్ మండలం చిడేడు గ్రామం అని, ఆర్టీసి బస్సులు సమయానికి రావటం లేదని ఫిర్యాదు వెళ్ళింది. ఫిర్యాదు చేసింది అదే గ్రామనికి చెందిన వైష్ణవి అనే 8వ తరగతి చదివే విద్యార్ధి. ఆర్టీసి బస్సులు సమయానికి రాక విసుగు చెంది, తాను ఈ సమస్య వల్ల స్కూల్ కి సరిగ్గా వెళ్ళలేక పోతున్నాను అంటూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు.
అయితే ఆ విద్యార్ధి వినతి పై ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందించారు. సమస్యను తెలంగాణా ఆర్టీసి అధికారులకు చెప్పారు. ఇంకేముంది, సాక్ష్యాత్తు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా రంగంలోకి దిగే సరికి, ఆర్టీసి ఎండీ సజ్జనార్ కూడా అలెర్ట్ అయ్యారు. వెంటనే సమస్య గురించి అధికారులతో మాట్లాడారు. బస్సులు వెంటనే పునరుద్ధరించాలని, చెప్పి, సమస్య పరిష్కారం అయ్యేలా చూసారు. విషయం చీఫ్ జస్టిస్ కు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం చీఫ్ జస్టిస్ పూనుకోవటంతో, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. ఒక చిన్న పిల్ల రాసిన సమస్యకు కూడా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందించటం, ఆ సమస్య పరిష్కారం అవ్వటం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వ్యవస్థలు అన్నీ ఇంతే బాధ్యతగా ఉంటే , ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఇలా సమాజంలో జరిగే అనేక సమస్యల పై ఇటీవిల చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందిస్తున్న తీరు, ప్రశంసలు అందుకుంటుంది.