వివేక కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో సిబిఐ, వివేక కేసులో దూకుడు మీద ఉంది. సూత్రదారులు ఎవరో ఇప్పటికీ తెలవక పోయినా, పాత్రధారులు మాత్రం ఒక్కొక్కరు దొరుకుతున్నారు. ముఖ్యంగా వివేక వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ తో మొత్తం దొంక కదిలింది. దీంతో అప్పటి వరకు విచరణకు సహకరిస్తున్న సునీల్ యాదవ్ అనే వ్యక్తి పరారు అయ్యాడు. హైకోర్టులో అరెస్ట్ చేయనివ్వకుండా కేసు వేసాడు. అయితే సిబిఐ అతన్ని గోవాలో పట్టుకుంది. కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. నిన్న అతన్ని విచారణ నిమిత్తం కోర్టు అనుమతి అడిగి తీసుకున్నారు. నిన్న రాత్రి అంతా చేసిన విచారణలో, పలు కీలక విషయాలు సిబిఐకి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు సిబిఐ అధికారులు గ్రౌండ్ లోకి వచ్చారు. వివేకా ఇంటి సమీపంలోని వాగులో సిబిఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వాగులో ఈ మధ్య వర్షం పడటంతో నీళ్ళు రావటంత, ఆ నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు. విషయం ఏమిటి అని ఆరా తీయగా, ఆ వాగులోని ఇసుకలో, వివేక హ-త్య కోసం ఉపయోగించిన ఆయుధాలు దాచినట్టు, సిబిఐకి సునీల్ యాదవ్ సమాచారం ఇవ్వటంతో, ఆ ఆయుధాల రికవరీ కోసం సిబిఐ అధికారులు, ఫీల్డ్ లోకి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.
ముందుగా సునీల్ యాదావ్ ను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కడప నుంచి పులివెందులకు తీసుకుని వచ్చారు. అక్కడ వివేక ఇంటి సమీపంలోని వాగు వద్ద తీసుకుని వచ్చారు. మునిసిపల్ అధికారుల సాయంతో, భారీ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు. మరో పక్క మరో బృందం, ఇసుకని తవ్వుతూ, ఆయుధాల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే రెండేళ్ళ తరువాత, ఈ రోజు ఆయుధాల కోసం గాలింపు చేస్తూ ఉండటంతో, అసలు అవి దొరుకుతాయా అనే సందేహం వ్యక్తం అవుతుంది. రోటరీపురం వంకలో ఇవి ఉన్నాయని సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో, సిబిఐ ఈ సోదాలు చేస్తుంది. గతంలో వివేక చనిపోయిన సమయంలో, ముందుగా గుండె పోటు అంటూ నమ్మించారు. తరువాత ఆయన తలకు కుట్లు ఉండటంతో, అందరికీ అనుమానం రాగా, చివరకు అది గొ-డ్డ-లి పోటు అని అర్ధం అయ్యింది. అయితే ఇప్పుడు నిజంగా ఆ ఆయుధాలు ఇక్కడ దొరుకుతాయా అనేది చూడాలి. ఇక మరో పక్క, సునీల్ యాదవ్ ని, పది రోజులు విచారణకు తీసుకోవటంతో, ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి.