ఒక పక్క పోలవరం విషయంలో, రాష్ట్రానికి పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం, దాన్ని నుంచి బయట పడక ముందే, మరో షాక్ ఇచ్చి, జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేంద్రం జలశక్తి శాఖ ఇచ్చిన షాక్ తో, ఇప్పుడు రాష్ట్రానికి మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కేంద్ర జలశక్తి శాఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చిన నివేదిక ఆధారంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు, కీలక తీర్పు ఇచ్చింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం అంటూ, ఒక కొత్త ఎత్తిపోతల పధకం మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దీని పై తెలంగాణా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళింది. ఇక్కడ ఈ రోజు, రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కు ఎదురైంది. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పధకానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ తప్పనిసరని, అది లేకుండా ముందుకు వెళ్ళవద్దు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. గతంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది పాత ప్రాజెక్ట్ అని, కాబట్టి దానికి కొత్తగా అనుమతులు అవసరం లేదు, పర్యావరణ అనుమతులు అవసరం లేదు, సిడబ్ల్యుసి అనుమతులు అవసరం లేదు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే తుది తీర్పు వచ్చేంత వరకు, తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని, అయితే దీనికి సంబందించిన ప్రక్రియకు, ప్రాధమిక పేపర్ వర్క్, టెండర్లకు అనుమతులు ఇవ్వాలి అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకుంది.
దీంతో టెండర్ లు పిలిచినప్పటికీ, ఫైనల్ చేసినప్పటికీ కూడా, తుది తీర్పు వచ్చే వరకు దీని పై ముందుకు వెళ్ళకూడదు అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపధ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో చాలా స్పష్టంగా, పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఇది కొత్త ప్రాజెక్ట్ అంటూ, కొత్త కాలువులు, సామర్ధ్యం పెంచారు కాబట్టి, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని, అలాగే పూర్తీ స్థాయి డీపీఆర్ ఇవ్వకుండా దీనికి అనుమతులు ఇవ్వకూడదు అంటూ సిడబ్ల్యుసి స్పష్టం చేసింది. దీనికి కేంద్రం జలశక్తి శాఖ కూడా దీనికి అంగీకరించింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టకూడదు, ముందు డీపీఆర్ లు ఇచ్చిన తరువాతే, కొత్త ప్రాజెక్ట్ ల పై నిర్ణయం తీసుకోవాలని, అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు ఇది మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళే అవకాసం ఉంది. అప్పుడు కూడా డీపీఆర్ ను కేంద్ర జల శక్తి శాఖ ఆమోదించి, అప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిన తరువాత, ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ఇచ్చే సమయంలో, గతంలో కేంద్ర జల శక్తి శాఖ, ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళవద్దు అంటూ రాసిన లేఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తావించింది. దీంతో కేంద్రం ఇచ్చిన లేఖ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వటానికి, బలం చేకుర్చుంది అనే చెప్పవచ్చు.