విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ ని, క-రో-నా ట్రీట్మెంట్ కోసం, ఉపయోగించుకోమని డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, కొన్నాళ్ళు గడిచిన తరువాత, అక్కడ అగ్నిప్రమాదం జరగటం, ఇవన్నీ తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ఘటనకు డాక్టర్ రమేష్ ని బాద్యుడిని చేస్తూ, ఆయన్ను టార్గెట్ చేసింది. ఒకానొక దశలో ఆయన ఆచూకీ తెలిపితే, లక్ష రూపాయలు బహుమానం ఇస్తాం అంటూ, పోలీసులు ప్రకటన కూడా చెయ్యటం, అప్పట్లో సంచలనం అయ్యింది. ఒక డాక్టర్ కోసం, అదీ తనకు సంబంధం లేని హోటల్ లో, కేవలం వైద్యానికి మాత్రమే బాధ్యత అయిన, డాక్టర్ రమేష్ పై ఎందుకు ఇలా చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే డాక్టర్ రమేష్, ఈ కేసు పై హైకోర్టుకు వెళ్ళారు. తన పై వేసిన కేసు కొట్టేయాలని, తాను వైద్యం మాత్రమే చేసానని, హోటల్ నిర్వహణ తమకు సంబంధం లేదని, హోటల్ అద్ది కూడా పేషెంట్ల నుంచి హోటల్ యాజమాన్యం తీసుకుందని, కోర్టుకు చెప్పారు. దీని పై హైకోర్టు కూడా, అసలు ఈ ఘటనకు ప్రాధమిక బాధ్యత ఎవరిదో ఫిక్స్ చెయ్యాలని, ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చింది. అంతకు ముందే ఇక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహణ చేసింది కదా, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర అధికారులు దీనికి ఎందుకు బాధ్యులు కాదు, ఫైర్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, లాంటి ప్రశ్నలు సందించింది.
అయితే హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా, వచ్చే వారం సుప్రీంలో ఈ కేసు పై విచారణ జరగనుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కేసు హైకోర్టు ముందుకు వచ్చింది. ఘటన జరిగిన తరువాత రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, జనరల్ మ్యానేజర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అయితే వారు హైకోర్టులో బెయిల్ పిటీషన్ వెయ్యటంతో, హైకోర్టులో ఈ విషయం పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు వారిని ఎందుకు రిమాండ్ కు పంపించారు, ఈ ఘటనతో వారికి ఏమి సంబంధం ఉంది అంటూ, పోలీసులను ప్రశ్నించింది. హాస్పిటల్ లో పని చేస్తున్నారని, వారిని బలి పశువులని చేసారా అంటూ, ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులని ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తూ, ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురూ పోలీసులకు విచారణలో అవసరమైన సమయంలో సహకరించాలని ఆదేశించింది.