నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం ఎన్95 మాస్క్‌లు ఇచ్చే పరిస్థితి లేదని ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు సుధాకర్ రావు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులే ఉంటే నర్సీపట్నం మొత్తం కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో పని చేసే మత్తు వైద్యుడు సుధాకర్ రావు... ఆస్పత్రిలోని పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేరుకే 150 పడకల ఆస్పత్రి ఉందని.. కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లకు ఒక్క మాస్క్ ఇచ్చి 15 రోజుల వాడమంటున్నారని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో ఆర్డినేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారని.. ప్రసూతి నిపుణురాలిని ఇంతవరకు నియమించలేదని అన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ఆస్పత్రిని కనీసం పట్టించుకునే స్థితిలో లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ ఘటనపై కలెక్టర్ సూచనల మేరకు జిల్లా అధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రిలోని పరికరాలు పరిశీలించారు. మాస్కులు, రక్షణ పరికరాల వివరాలు తెలుసుకున్నారు. అయితే వైద్యుడు చేసిన ఆరోపణల్లో నిజం ఉందో లేదో విచారణ కమిటీ రిపోర్ట్ ఏమిటో బయటకు రాక ముందే ప్రభుత్వం ఆక్షన్ తీసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సీనియర్ వైద్యుడు సుధాకర్ ను ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే కేవలం సస్పెన్షన్ తోనే, ప్రభుత్వం ఆగలేదు. ఆ దళిత డాక్టర్ పై కేసు కూడా పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఉన్నతాధికారులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి పలు సెక్షన్ల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ పై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్-95 మాస్కుల కోసం డిమాండ్ చేయడమే డా.సుధాకర్ చేసిన నేరమా? సమస్యను పరిష్కరించకుండా వైద్యుడిని సస్పెండ్ చేస్తారా? కరోనా నివారణకు ముందుండి పోరాడే వైద్యులను అగౌరపరచడం మంచిది కాదు అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై మండి పడ్డారు.