ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా అంశం కర్నాటకలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అక్కడి ముఖ్యమంత్రి, ఏపీ అంశాలను కూడా విజయానికి అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహ రచన చేశారు. పదే పదే అంధ్రప్రదేశ్ కు గత సాధారణ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కర్నాటకలోనే తిష్టవేసి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఏపీకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలుగు ప్రజలను వంచనకు గురిచేసిన మోడీ, షాలు కర్నాటకకు ఏమి న్యాయం చేస్తారని ఓటర్ల దృష్టికి తేవడం ద్వారా గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
రోజూ ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శ్లాఘిస్తూ బీజేపీపైకి పదునైన అస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వుండి నేరుగా తెలుగుదేశం మద్దతును ప్రత్యక్షంగా కోరకపోయినప్పటికీ, తెలుగుదేశం అభిప్రాయాలకు పెద్ద ఎత్తున విలువనిస్తూ ప్రచార బరిలో ముందున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని కూడా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు కర్నాటక ఓటర్లను మోసం చేయడానికి మళ్ళీ వచ్చారని ఆరోపిస్తున్నారు. నేరుగా ఇరువురు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవకుండానే వారిని ముగ్గులోకి దింపడం ద్వారా గెలుపు దిశగా సిద్దరామయ్య దూసుకుపోతున్నారని చెబుతున్నారు.
ఫలితంగానే ఏ.పి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రజల ఓట్ల ద్వారా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుండగా కర్నాటక ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలలో మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఆ ప్రభావం ఏ.పి పై వుండబోతోందని కూడా చెప్పారు. ఫలితంగానే కర్నాటక లో బీజేపీ గెలవకూడదనే నిశ్చితాభిప్రాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వున్నారని తెలిసింది. తిరుపతి బహిరంగ సభ అనంతరం పూర్తి స్థాయిలో కర్నాటక ఎన్నికలపై దృష్టి సారించాలనే యోచనలో ముఖ్యమంత్రి వున్నారు. అయితే వ్యహం ప్రత్యక్షమా లేదా పరోక్షమే అనే సందిగ్ధత నెలకొందని, త్వరలోనే ఈ విషయమై ఒక స్పష్టతకు వస్తారని తెలిసింది.